ISIS చీఫ్‌ను హతమార్చిన అమెరికా!

ISIS చీఫ్‌ను హతమార్చిన అమెరికా!

Updated On : October 27, 2019 / 5:41 AM IST

ISIS (ఇస్లామిక్‌ స్టేట్ ఉగ్రవాద సంస్థ) అగ్రస్థాయి నాయకుడు అబూ బకర్‌ ఆల్‌-బాగ్దాదీను హతమార్చినట్లు సమాచారం. ఉగ్రవాదాన్ని మట్టుబెట్టడంలో భాగంగా అమెరికా సైన్యం జరిపిన ఓ రహస్య ఆపరేషన్‌ జరిపింది. ఇందులో భాగంగానే పలువురిపై కాల్పులు జరిపి మట్టుబెట్టారు. యూఎస్‌ ఆర్మీ అబూబకర్‌పై కాల్పులు జరిపినట్లు అధికారులు వెల్లడించారు.

‘న్యూస్‌ వీక్‌’ అనే పత్రిక వెల్లడించిన కథనం ప్రకారం.. ఈ విషయాన్ని రక్షణశాఖ అధికారులు వైట్‌ హౌస్‌కు అందించారు. అబూ బకర్‌ టార్గెట్ చేసి పెద్ద స్థాయిలో వ్యూహరచన జరిగినట్లు సమాచారం. ఈ ఆపరేషన్‌ను వారం క్రితం అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ కూడా ఆమోదించినట్లు వెల్లడించింది. 

దీనిపై అధికారికంగా స్పందించపోయినప్పటికీ ట్రంప్ పరోక్షంగా ఈ విషయాన్ని వెల్లడించారు. ఆదివారం ఉదయం ట్రంప్ అధికారిక ట్విట్టర్ ఖాతాలో ‘ఇప్పుడే ఒక పెద్ద ఘటన జరిగింది’ అని పోస్టు చేయడంతో ఆ న్యూస్ మీడియా కథనాన్ని బలపర్చింది. 

ఇరాక్‌ నుంచి అమెరికా సైన్యం వైదొలగినా బాగ్ధాదీ వేట మాత్రం ఆపలేదు. కొంతకాలంగా అతడు సిరియాలో ఉన్నట్లు అమెరికా సైన్యం గుర్తించింది. అబుబకర్‌ను మట్టుబెట్టడానికి అత్యున్నత స్థాయిలో వ్యూహరచన చేశారు. వారం క్రితం ఈ ఆపరేషన్‌కు ట్రంప్‌ కూడా ఆమోదం తెలిపారు. అప్పటికే టార్గెట్‌ను ఫిక్స్ చేసిన అమెరికా సైన్యం కమెండోల సాయంతో పని పూర్తి చేసింది.

బాగ్ధాదీ చనిపోయాడన్న వార్త మొదటిసారేం కాదు. గతంలోనూ ఐదారుసార్లు బాగ్ధాదీని అమెరికా మీడియా చంపేసింది. మళ్లీ కొన్ని నెలల తర్వాత అతడు బయటకొచ్చి తాను బతికే ఉన్నానని ప్రకటించడం జరిగింది. ఐదేళ్లుగా బాగ్ధాదీ బయటకు రాలేదు. అప్పుడప్పుడు వీడియోలు మాత్రం బయటకు వచ్చేవి. ఇరాక్‌లో ఐసిస్‌ పరాజయం తర్వాత బాగ్ధాదీ ఆచూకీ ఎవరికీ తెలియలేదు. అయితే ఇటీవల శ్రీలంకలో జరిగిన ఉగ్రదాడుల సమయంలో మరోసారి అబుబకర్ పేరు తెరపైకి వచ్చింది. దాడులు తమ పనేనని అతడు ఓ వీడియోలో పేర్కొన్నాడు. 

బాగ్ధాదీపై రెండున్నర కోట్ల అమెరికన్ డాలర్ల రివార్డు ఉంది. అల్‌ఖైదా ఇరాకీ విభాగమే ఐసిస్‌…1999లో ఇది ఏర్పడింది.  2010 నుంచి దీనికి బాగ్ధాదీ నేతృత్వం వహిస్తున్నాడు. పలు విధ్వంసకర ఘటనలకు నేతృత్వం వహించాడు. ఇతడీ ఆధ్వర్యంలోనే ఐసిస్‌ పటిష్ఠమైన ఉగ్రవాద సంస్థగా ఎదిగింది. ఇరాక్‌, సిరియాల్లోని చాలా ప్రాంతాల్లో సమాంతర ప్రభుత్వం నడిపింది. షరియా చట్టాలను అమలు చేసింది. అయితే సంకీర్ణదళాల దాడులతో ఐసిస్‌ క్రమంగా తన పట్టు కోల్పోయింది. అతి కొద్ది ప్రాంతాలకే పరిమితమైంది. కీలకమైన నేతలు అమెరికా దాడుల్లో ప్రాణాలు కోల్పోయారు. బాగ్ధాదీ మాత్రం ఎప్పటికప్పుడు తప్పించుకుంటూ వస్తున్నాడు. తాజా దాడుల్లో అతడు కూడా చనిపోవడంతో ఐసిస్‌కు గట్టి దెబ్బ తగిలినట్లైంది.