హెయిర్‌కట్ చేయడానికి ఆలస్యంగా వచ్చాడని.. జైల్లో పెట్టారు

హెయిర్‌కట్ చేయడానికి లేటుగా వచ్చాడన్న అక్కసుతో క్షురకుడిని జైల్లో పెట్టించాడో పోలీస్ ఆఫీసర్.

హెయిర్‌కట్ చేయడానికి ఆలస్యంగా వచ్చాడని.. జైల్లో పెట్టారు

Updated On : May 30, 2024 / 8:22 PM IST

Hair Cut: హెయిర్‌కట్ చేయడానికి లేటుగా వచ్చాడన్న అక్కసుతో క్షురకుడిని జైల్లో పెట్టించాడో పోలీస్ ఆఫీసర్. ఈ విషయం ఉన్నతాధికారుల వరకు వెళ్లడంతో బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఉత్తరప్రదేశ్‌లోని బుదౌన్‌ జిల్లాలోని బిసౌలీ పోలీస్ స్టేషన్‌ పరిధిలోకి జరిగింది.

బిసౌలీ పోలీస్ స్టేషన్‌ సర్కిల్ ఆఫీసర్ (సీఓ) సునీల్ కుమార్ ఇంటి దగ్గర హెయిర్‌కట్ చేయించుకోవాలనుకుని వినోద్ కుమార్‌ అనే క్షురకుడికి కబురు పంపించాడు. అయితే వినోద్ కుమార్‌ ఆలస్యంగా రావడంతో సర్కిల్ ఆఫీసర్‌కు కోపం వచ్చింది. వెంటనే తన కానిస్టేబుళ్లను పంపి వినోద్ కుమార్‌ షాపు మూసేయించి, అతడిని తీసుకెళ్లి జైల్లో పెట్టారు.

బాధితుడి సోదరుడు శివ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. “వినోద్ ఇతర కస్టమర్లతో బిజీగా ఉండడంతో సర్కిల్ ఆఫీసర్ నివాసానికి ఆలస్యంగా వెళ్లాడు. కొన్ని గంటల తర్వాత కొంతమంది పోలీసులు మా దుకాణానికి వచ్చారు. సెలూన్‌ను క్లోజ్ చేయించి వినోద్‌ను పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్లారు. బుధవారం మధ్యాహ్నం వరకు వినోద్‌ను లాకప్‌లో ఉంచారని తెలిపారు.

Also Read: మా ఆయనకు అమ్మాయిల పిచ్చి.. పబ్జీలో అమ్మాయిలను ట్రాప్ చేస్తున్నాడు..

సెలూన్ నిర్వాహకుడిని జైల్లో పెట్టిన ఘటనపై బుదౌన్‌ జిల్లాపోలీసు సూపరింటెండెంట్ అలోక్ ప్రియదర్శి స్పందించారు. ఈ విషయం తన దృష్టికి వచ్చిందని, విచారణ జరుపుతున్నామని.. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు.