ఐసీయూలో పేషెంట్ మృతి.. డాక్టర్లపై బంధువుల దాడి.. ఐదుగురిపై కేసు

ముంబైలోని BMC ఆధ్వర్యంలోని KEM hospital ఆస్పత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్న 18ఏళ్ల యువకుడు గుండెపోటుతో మృతిచెందాడు.. అతడి మృతికి ఆస్పత్రి వైద్యులే కారణమంటూ మృతుడి బంధువులు వైద్యురాలు సహా సిబ్బందిపై దాడికి దిగారు.. అసభ్యపదజాలం వాడుతూ 30మంది ఐసీయూలోకి ప్రవేశించి దాడి చేశారు.
ఆస్పత్రి యాజమాన్యం ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగారు.. సీనియర్ వైద్యులు, పోలీసులు జోక్యంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో ఆస్పత్రి సీసీ కెమెరాలో రికార్డు అయింది. ఈ వీడియో ఆధారంగా పోలీసులు ఐదుగురిపై కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.. తీవ్ర జ్వరంతో బాధపడుతున్న 18 ఏళ్ల యువకుడు సెప్టెంబర్ 5న ఉదయం 9 గంటల ప్రాంతంలో ముంబైలోని KEM hospitalలో చేరాడు. అతడ్ని చేర్చుకున్న వైద్యులు చికిత్స ప్రారంభించారు.
అప్పటికే అతడికి ఫిడ్స్, శ్వాస తీసుకోలేకపోతున్నాడు. వెంటనే అతడికి వైద్యులు వెంటిలేటర్ సపోర్ట్ అందించారు. యాంటీబాడీలు ఇచ్చారు. అయినా అతడిలో ఎలాంటి మార్పు కనిపించలేదు. ఆరోగ్యం మెరుగుపడలేదు. ఆరోగ్య పరిస్థితి మరింత విషమించి అతడికి గుండెపోటు వచ్చింది. సెప్టెంబర్ 9న మధ్యాహ్నం 1.20 గంటలకు ఆస్పత్రిలో మృతిచెందాడు.
ఆ సమయంలో అతడి ముందు సోదరుడు, బాబాయి కూడా ఉన్నారని ఆస్పత్రి వైద్యులు తెలిపారు. విచక్షణ లేకుండా ఐసీయూలోకి ప్రవేశించడమే కాకుండా వైద్యురాలు సహా సిబ్బందిపై దాడి చేశారు. పోలీసులకు ఫోన్ చేయడంతో అక్కడి వచ్చిన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. దాడికి పాల్పడిన ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.