ప్రయాణంలో పరిచయం..బలానికి టాబ్లెట్లని నిద్రమాత్రలు ఇచ్చి…..

woman duped from man, sleeping tablets gold robbery : బస్సు ప్రయాణంలో పరిచయం అయిన మహిళ ఇంటికి వెళ్లిన వ్యక్తి ఆమెకు నిద్రమాత్రలు ఇచ్చి దొంగతనం చేసిన ఘటన హైదరాబాద్ లో వెలుగు చూసింది. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన మహిళ(36) ఎర్రగడ్డలో నివాసం ఉంటుంది. గతంలో ఆమెకు బస్సులో ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు.
ప్రయాణంలోనే ఇద్దరూ ఒకరి ఫోన్ నెంబర్లు ఒకరు తీసుకున్నారు. బస్సు దిగి ఎవరింటికి వాళ్లు వెళ్లిపోయిన తర్వాత ఇద్దరూ తరచూ ఫోన్ లో స్నేహితులుగా మాట్లాడుకుంటూ ఉండేవారు. ఈక్రమంలో మహిళ ఆ వ్యక్తిని ఈ నెల 22న తన ఇంటికి ఆహ్వానించింది. ఇంటికి వచ్చిన ఆవ్యక్తి ఆమెతో కాసేపు ముచ్చటించాడు.
అనంతరం విటమిన్ టాబ్లెట్లని నమ్మించి ఆమెకు నిద్రమాత్రలు ఇచ్చివేసుకోమన్నాడు. ఆ టాబ్లెట్లు వేసుకున్న కాసేపటికి మహిళ మత్తులోకి జారుకోగా ఇదే అదనుగా భావించిన వ్యక్తి అందుబాటులో ఉన్న రెండు తులాల బంగారు ఆభరణాలను దోచుకుని పరారయ్యాడు. మెలుకవ వచ్చిన మహిళ చోరీ జరిగిన సంగతి గుర్తించి సనత్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.