తన కూతురికి పిల్లలు లేరని, పసికందుని దొంగలించింది

తన కూతురికి పిల్లలు లేరని ఓ మహిళ చేసిన పని ఆమెని కటకటాల పాలు చేసింది. ఊచలు లెక్కి పెట్టించింది. తన కూతురికి పిల్లలు లేకపోవడంతో ఓ మహిళ పసికందుని దొంగలించింది. పసికందుని ఎత్తుకొచ్చి తన కూతురికి ఇచ్చింది. బాధితురాలి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టి సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పసికందుని ఎత్తుకెళ్లిన మహిళని గుర్తించి అరెస్ట్ చేశారు. ఢిల్లీలో ఈ ఘటన జరిగింది.
కారీ బోలి ప్రాంతంలో ఓ మహిళ తన ఐదేళ్ల కొడుకు, 25 రోజుల పసికందుతో కలిసి ఫుట్ పాత్ మీద నిద్రపోయింది. తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఆమెకు మెలకువ వచ్చింది. లేచి చూస్తే పక్కలో ఉండాల్సిన పసికందు కనిపించలేదు. దీంతో ఆమె ఆందోళనకు గురైంది. చుట్టుపక్కల అంతా వెతికింది. ఎక్కడా పసికందు ఆచూకీ లేదు. దీంతో కంగారు పడిన ఆమె పోలీసులను ఆశ్రయించింది. పసికందు కనిపించడం లేదని ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు.
https://10tv.in/woman-walks-out-on-plane-wing-to-get-some-air-she-is-too-hot-inside-commercial-flight-in-kyiv-airport/
ఆ మహిళ నిద్రపోయిన ప్రాంతంలో పోలీసులు విచారణ చేశారు. వారికి అక్కడ సీసీటీవీ కెమెరా కనిపించింది. వెంటనే దాన్ని ఫుటేజీ తీసుకున్నారు. అందులో 58 ఏళ్ల వయసున్న ఓ పెద్దావిడ పసికందుని ఎత్తుకెళ్లడం స్పష్టంగా కనిపించింది. ఆ ఫుటేజీ ఆధారంగా పెద్దావిడ ఆచూకీని పోలీసులు కనుగొన్నారు. ఆమె దగ్గరి నుంచి పసికందుని కాపాడి కన్నతల్లికి అప్పగించారు. ఎందుకిలా చేశావని పోలీసులు అడిగారు. తన కూతురికి పిల్లలు లేరని, అందుకే ఇలా పసికందుని దొంగలించి తన కూతురికి ఇచ్చానని నిందితురాలు చెప్పింది. పెద్దావిడకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఒక కూతురు ఆగ్రాలో నివాసం ఉంటుంది. ఆమెకి పిల్లలు లేరు.