పెళ్లి కోసం దొంగగా మారిన యువకుడు

  • Published By: chvmurthy ,Published On : March 21, 2020 / 10:14 AM IST
పెళ్లి కోసం దొంగగా మారిన యువకుడు

ప్రేమించిన యువతిని పెళ్లి చేసుకోవాలంటే డబ్బు కావాలి… ఇప్పటికిప్పుడు అంత డబ్బుసమకూరే ఉద్యోగం తాను చేయటంలేదు ఏం చేయాలి…. చేతిలో చూస్తే చిల్లి గవ్వలేదు…. .ఆలోచించాడు ఒక చిరుద్యోగి. ఎందుకు ఆ మార్గం ఎంచుకున్నాడో ఏమో…. దొంగతనం చేయాలనుకున్నాడు. అనుకున్నదే  తడవుగా దొంగతనం చేశాడు. పెళ్లి చేసుకున్నాడు. చివరికి పోలీసులకు చెప్పి జైలు పాలయ్యాడు. 

పాతబస్తీలోని ఛత్రినాక, గౌలిపుర లోని ఉప్పుగూడ ప్రాంతానికి చెందిన  గువ్వల శంకర్ కుమారుడు సుమన్(22) మలక్ పేట లోని ఒక వాటర్ ప్లాంట్ లో పని చేస్తున్నాడు. మార్చి 16 న సుమన్ తాను ప్రేమించిన యువతితో పెళ్లి ముహూర్తం ఫిక్స్ చేసుకున్నాడు. ముహూర్తం దగ్గర పడుతోంది. చేతిలో చిల్లి గవ్వలేదు. ఇంక అందుకు ఒకటే మార్గం అనుకున్నాడు.  దొంగతనం చేయాలనుకున్నాడు. యాకత్‌పురలోని బ్రహ్మణవాడి, ఉప్పర్‌బస్తీ ప్రాంతానికి చెందిన వై.భార్గవి ఫరుఖ్‌నగర్‌ ఆర్టీసీ డిపోలో కండక్టర్‌గా పనిచేస్తుంది. ఆమె ఈనెల 14న  భార్గవి ఫలక్ నామా వెళ్ళటానికి  యాకత్ పురా రైల్వే స్టేషన్ లో ఎంఎంటీఎస్  రైలు ఎక్కింది.  
 

రైల్వేస్టేషన్ లో రైలు కదులుతుండగా సుమన్ .. భార్గవి బ్యాగులో ఉన్న రూ.25 వేల నగదు,  ఆర్టీసీ ఐడీ కార్డు, ఖరీదైన సెల్ ఫోన్, ఏటీఎం కార్డును దొంగిలించి రైలు దిగి పారిపోయాడు.  ఆ డబ్బుతో 16 వ తేదీన ప్రేమించిన యువతిని అలియాబాద్ లోని ఆర్యసమాజ్ లో వివాహం చేసుకున్నాడు. తన బ్యాగులో నగదు పోవటంతో భార్గవి పోలీసులకు ఫిర్యాదు చేసింది.  కేసు  నమోదు చేసుకున్న రైల్వే పోలీసులు  విచారణ చేపట్టారు.  
 

యాకత్ పురా రైల్వే స్టేషన్ లో  అనుమానాస్పదంగా సంచరిస్తున్న సుమన్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా చేసిన చోరీ ఒప్పుకున్నాడు.  అతని వద్దనుంచి రూ.3100 నగదు. భార్గవి ఐడీ  కార్డు, సెల్ ఫోన్, ఏటీఎం కార్డు, ను స్వాధీనం చేసుకుని శుక్రవారం మార్చి 20న రిమాండ్ కు తరలించినట్లు రైల్వే ఎస్సై సంగమేశ్వర్ తెలిపారు. 

Also Read | యాక్సిడెంట్లు అవడానికి కారులో ఈ 5 మెయిన్ పార్ట్‌లే కారణం. చెక్ చేసుకున్నారా?