వైఎస్ వివేకా హత్య : చనిపోయే స్థితిలో లెటర్ రాయడం సాధ్యమేనా

  • Published By: madhu ,Published On : March 16, 2019 / 01:17 AM IST
వైఎస్ వివేకా హత్య : చనిపోయే స్థితిలో లెటర్ రాయడం సాధ్యమేనా

Updated On : March 16, 2019 / 1:17 AM IST

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తెరపైకి వచ్చిన లెటర్‌ ఇపుడు కీలకంగా మారింది. అసలు ఈ లేఖ ఎవరు రాశారు? చనిపోయే ముందు నిజంగానే ఆయన రాశారా? లేదంటే… ఎవరైనా రాసిపెట్టారా? అనుకున్నట్లుగానే వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు మలుపులు తిరుగుతోంది. ఆయన హత్యపై ఓవైపు ఎన్నో అనుమానాలు నెలకొని ఉండగా… మరోవైపు ఆయన రాసినట్లు చెబుతున్న లేఖ ఒకటి వెలుగులోకి వచ్చింది. తన డ్రైవర్‌ను తొందరగా డ్యూటీకి రమ్మన్నందుకు చచ్చేలా కొట్టాడని… ఈ లెటర్ రాయడానికి కూడా చాలా కష్టపడ్డానని.. డ్రైవర్ ప్రసాదును వదిలిపెట్టవద్దని అని ఆ లేఖలో రాసి ఉంది… ఇట్లు వైఎస్ వివేకానందరెడ్డి.. అని కూడా ఉంది. ఇదే ఇపుడు ఎన్నో ప్రశ్నలకు కేంద్రబిందువుగా మారింది.

ఈ క్రైమ్ సీన్‌ను చూస్తే.. ఆ సమయంలో అంటే చనిపోయే వ్యక్తి ఇంత డీటైల్డ్‌గా లేఖ రాయగలరా? అను అనుమానం కలుగుతోంది. అసలు వైఎస్ వివేకానే ఈ  లేఖ రాశారా? లేకపోతే ఎవరైనా రాసి అక్కడ పెట్టారా? అదే నిజమైతే లేఖ రాసింది ఎవరు? డ్రైవర్ పేరును ఎందుకు రాశారు?  పలు సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. వైఎస్ జగన్ కూడా ఇదే అనుమానాన్ని వ్యక్తం చేశారు. ఇదంతా కట్టుకథలా ఉందని అన్నారు.

సాధారణ ప్రజల్లోనూ ఈ లేఖపై ఎన్నో సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. చనిపోయే స్థితిలో లెటర్ రాయడం సాధ్యమేనా..  రక్తపు మడుగులో ఆయన పడిపోయి ఉంటే… గుండెపోటు అని ఎందుకు ప్రచారం చేశారు లాంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ప్రస్తుతం ఈ కేసుపై సిట్ విచారణ జరుపుతోంది. మరి విచారణలో ఎలాంటి సంచలనాలు వెలుగుచూస్తాయోనని అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది.