ఉస్మానియా చరిత్ర శాఖకు 100 ఏండ్లు

దక్షిణ భారతదేశ చరిత్ర మహాసభలకు ఉస్మానియా యూనివర్సిటీ వేదిక కానుంది. ఉస్మానియా యూనివర్శిటీ దేశవ్యాప్తంగా ఎంతో అత్యున్నత స్థాయిలో నిలిచింది . OU కి ప్రపంచస్థాయిలో ఎంతో గుర్తింపు ఉంది. తాజాగా వందేళ్లు పూర్తి చేసుకున్న చరిత్ర విభాగం ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ సందర్భంగా 39వ సౌత్ ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ సదస్సుకి ఆతిథ్యం ఇవ్వనుంది. ఫిబ్రవరి 8, 9, 10వ తేదీల్లో ఉస్మానియా ఆవరణలో సదస్సులు నిర్వహించనున్నారు. దేశవ్యాప్తంగా ఆయా విశ్వవిద్యాలయాలకు చెందిన సుమారు 2వేల మంది ఆచార్యులు, వెయ్యి మంది విద్యార్థులు హాజరుకానున్నారు. వందలాది మంది పరిశోధన పత్రాలు సమర్పించనున్నారు.
ఉస్మానియాలోని పురాతన మరియు అతిపెద్ద విభాగాల్లో హిస్టరీ శాఖ ఒకటి. 1919లో UG కోర్సులతో ఇది ప్రారంభమైంది. 1924లో PG కోర్సులకు వేదికగా నిలిచింది. ఆ తర్వాత PHD ఎంఫిల్ కార్యక్రమాలు తెరిచారు. ఈ విభాగం అధ్యాపకులు విజయవంతంగా పనిచేస్తూ వందలాది పరిశోధక విద్యార్థులకు దిశానిర్దేశనం చేశారు. సుమారు 114 PHDలను, 75 మంది ఎంఫిల్ అభ్యర్థులను అందించారు. 2008లో ఎంఫిల్ కోర్సు నిలిచిపోయింది. 1981లో ‘ఉస్మానియా జర్నల్ ఆఫ్ హిస్టారికల్ రీసెర్చ్’ పేరుతో ప్రచురణను ప్రారంభించింది.
చరిత్ర విభాగం ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు చాలామంది ప్రముఖులు అధిపతులుగా పనిచేశారు. ఇందులో ఆచార్య ఆర్.సరోజిని తార్నాకలోని రాష్ట్ర పరిశోధక సంస్థకి డైరెక్టర్‌గా పనిచేశారు. వై.వైకుంఠం కాకతీయ వర్సిటీ ఉపకులపతిగా పనిచేశారు. సోమిరెడ్డి ఓయూ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్‌గా సేవలు అందించారు. 2017 నుంచి కె.అర్జునరావు విభాగ అధిపతిగా పనిచేస్తున్నారు.
1940లో ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ సదస్సు, 1979లో సౌత్ ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్‌లకు ఉస్మానియా చరిత్ర విభాగం ఆతిథ్యం ఇచ్చింది. 1986 జనవరి 9న నాటి చరిత్ర శాఖ హెడ్ ఆచార్య వైకుంఠం ఆధ్వర్యంలో OU ఠాగూర్ ఆడిటోరియంలో వేదికగా నిర్వహించిన 6వ SIHC సమావేశాలను అప్పటి ఆంధ్రప్రదేశ్ సీఎం ఎన్టీఆర్ ప్రారంభించారు. OU వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా 39వ సౌత్ ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్‌కి ఆతిథ్యం ఇచ్చే గొప్ప అవకాశం దక్కింది.
ప్రతిభావంతులకు బంగారు పతకాలు..
చరిత్ర విభాగంలో అత్యధిక మార్కులు సాధించిన అభ్యర్థికి ‘ఆచార్య ఆర్.నరసింహారావు గోల్డ్ మెడల్’ను అందిస్తున్నారు. మహిళకు MLN.రెడ్డి మెమోరియల్ గోల్డ్ మెడల్’ను అందిస్తున్నారు. వీటితోపాటు ఆర్థికంగా, వెనకబడిన తరగతులకు చెందిన పరిశోధక విద్యార్థులకు ఆర్థిక ప్రోత్సాహం అందిస్తున్నారు.
ఉస్మానియా చరిత్ర విభాగం వందేళ్లు పూర్తి చేసుకున్న తరుణంలో సౌత్ ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్‌కి ఆతిథ్యం ఇచ్చే అవకాశం దక్కడం చాలా ఆనందంగా ఉంది. ఉపకులపతి ఆచార్య ఎస్.రామచంద్రం, రిజిస్ట్రార్ గోపాల్‌రెడ్డి సహకారంతో ఈ సదస్సును అద్భుతంగా నిర్వహిస్తాం. దేశవ్యాపంగా పలు విశ్వవిద్యాలయాకు చెందిన వేలాది మంది ఆచార్యులు ఈ సదస్సుకి హాజరుకానున్నారు. పరిశోధక విద్యార్థులు తమ పరిశోధన పత్రాలను అందజేస్తారు. ఈ సదస్సుకి హాజరయ్యేందుకు నగరానికి వచ్చిన వారికి రవాణా సౌకర్యంతోపాటు వసతి, భోజన ఏర్పాట్లు చేస్తున్నాం.