తెలంగాణలో టెన్త్ ఫలితాల విడుదల మరింత ఆలస్యం

ఇంటర్ ఫలితాల ఎఫెక్ట్ టెన్త్ రిజల్ట్స్‌పై పడింది. తెలంగాణలో పదో తరగతి పరీక్షా ఫలితాలు మరింత ఆలస్యం అయ్యే అవకాశాలున్నాయి. ఇంటర్మీడియట్ ఫలితాల విడుదలలో గందరగోళం నెలకొనడంతో టెన్త్ రిజల్ట్స్ క్షుణ్ణంగా పరిశీలించాలని రాష్ట్ర విద్యాశాఖ నిర్ణయించింది. ఇంటర్ ఫలితాల్లో చోటుచేసుకున్న అవకతవకలు పదో తరగతి ఫలితాల్లో రిపీట్ కాకుండా పాఠశాల విద్యాశాఖ జాగ్రత్త తీసుకుంటోంది. ఇందుకోసం ఒకటికి రెండుసార్లు వెరిఫికేషన్ చేస్తోంది. దీంట్లో భాగంగానే ఫలితాల ప్రకటన ఆలస్యమవుతోందని.. విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దని సూచించింది. మరోవైపు.. ఇంటర్ ఫలితాల రీ వెరిఫికేషన్ బాధ్యతను ప్రభుత్వం గ్లోబరీనాతోపాటు డేటా టెక్ సంస్థకు అప్పగించింది.
టెన్త్ ఫలితాల వెల్లడిలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నామని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ విజయ్ కుమార్ తెలిపారు. ఇప్పటికే సమాధాన పత్రాల వ్యాల్యూయేషన్ పూర్తయిందని.. ఫలితాల వెల్లడిలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు. ఆలస్యమైనా.. కచ్చితత్వంతో ఫలితాలు ప్రకటిస్తామని చెప్పారు. ముందు జాగ్రత్తగా జవాబు పత్రాలను రీ వెరిఫికేషన్ చేస్తున్నట్టు చెప్పారు.
టెన్త్ ఫలితాలు విడుదల చేశాక ఆయా స్కూళ్ల హెడ్‌మాస్టర్ లాగిన్లతో విద్యార్థుల వివరాలు ఉంటాయని చెప్పారు. విద్యార్థి పేరు, గ్రేడ్ తోపాటు సబ్జెక్టుల వారీగా ఫలితాలను అందుబాటులో ఉంచుతున్నట్టు తెలిపారు. ఆన్‌లైన్‌లో తమ సమస్యలను తెలిపితే తమకు చేరినట్టు అక్‌నాలెడ్జ్‌మెంట్ కూడా వస్తుందన్నారు. ప్రతి విద్యార్థి గ్రేడ్ ఒకటికి రెండు సార్లు చెక్ చేసి ఫలితాలు విడుదల చేస్తామన్నారు.
ఒక్కో పేపర్ ను ఐదు అంచెలుగా చెక్ చేసి ఫైనల్ చేస్తున్నామని.. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎవరూ ఆందోళన చెందవద్దని కోరారు. విద్యార్థులకు ఏవైనా సందేహాలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. విద్యార్థులు నేరుగా ఫిర్యాదు చేసేలా ఆన్‌లైన్‌లో ఏర్పాట్లు చేసినట్టు చెప్పారు. ఒక సబ్జెక్టులో అధిక మార్కులు వచ్చి వేరే సబ్జెక్టులో ఫెయిల్ అయితే మరోసారి చెక్ చేయనున్నట్టు స్పష్టం చేశారు.
మరోవైపు.. తెలంగాణలో ఇంటర్ ఫలితాల్లో అవకతవకల నేపథ్యంలో.. ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ చేసిన సూచన మేరకు రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ ఫలితాల వెల్లడి బాధ్యతను గ్లోబరీనాతోపాటు ‘డేటా టెక్ మెథడెక్స్’ సంస్థకు అప్పగించారు. గ్లోబరీనా, డేటా టెక్ సంస్థలు వేర్వేరుగా ప్రాసెసింగ్ చేస్తాయని.. అలాగే రీవెరిఫికేషన్ ఫలితాలను సీజీజీ, జేఎన్‌టీయూహెచ్ విశ్లేషణ చేస్తాయని బోర్డు కార్యదర్శి అశోక్ తెలిపారు.