అమ్మాయిలు ఇలా సెల్ఫీలు దిగుతున్నారా? అయితే ఆ సమస్యే?

ఇప్పుడంతా సెల్ఫీ ట్రెండ్ నడుస్తోంది. అరచేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు.. సెల్ఫీ తీసుకోకుండా ఉండలేరు. అది అబ్బాయిలు కావొచ్చు.. అమ్మాయిలు కావొచ్చు. ఎవరైనా సరే.. తమను తాము సెల్ఫీ తీసుకుంటుంటారు. ఆ సెల్ఫీలను సోషల్ మీడియాలో పోస్టు చేసి లైక్స్, కామెంట్ల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఒకవేళ తమ సెల్ఫీకి ఆశించిన స్థాయిలో లైకులు, కామెంట్లు రాకపోతే తీవ్ర మానసిక వేదనకు గురవుతుంటారు. ఈ సమస్య కేవలం ఒక అబ్బాయిల్లోనే కాదు.. అమ్మాయిల్లోనే ఎక్కువట. తరచూ సెల్ఫీలు తీసుకోవడం సరిగా లేకుంటే చూసి అదేపనిగా బాధపడిపోవడం చేస్తుంటారు.
టీనేజీ బాలికల్లోనే ఎక్కువ :
సెల్ఫీ మోజులో పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని, సెల్ఫీ పిచ్చి ఉన్న అమ్మాయిల్లో మానసిక సమస్యలు అధికంగా ఉంటాయని ఓ అధ్యయనం చెబుతోంది. చాలామంది అమ్మాయిలు ఈ రోజుల్లో ఒంటరిగా తమను తాము సెల్ఫీలు తీసుకోవడం.. సెల్ఫీలో తమ శరీరం సౌష్టవం సరిగా లేదని మదనపడుతుంటారు. తమను తాము నిందించుకుంటారు.. మరికొంతమంది సెల్ఫీలో బాగోలేదని ఫర్ ఫెక్ట్ సెల్ఫీ వచ్చేంతవరకు ఎడిటింగ్ చేయడం వంటి పనుల్లో ఎక్కువ సమయాన్ని గడిపేస్తుంటారని యూనివర్శిటీ ఆఫ్ అరిజోనా పరిశోధకుల బృందం పేర్కొంది. సెల్ఫీకి తగినట్టుగా తమ శరీరం లేదని నిందించుకుంటూ ఆవేదనకు గురవుతూ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతుంటారు. ఈ సమస్యలు అధికంగా టీనేజ్ బాలికల్లో ఎక్కువగా ఉంటుందని అధ్యయనం చెబుతోంది.
మరొకరి సెల్ఫీలతో పోలిస్తే తాము బాగోలేమనే బాధ రోజురోజుకీ పెరిగిపోతుంది. అంతేకాదు.. తమ శరీరాన్ని అసహ్యించుకుంటారు. ఇలాంటి ప్రవర్తన మీ అమ్మాయిల్లో కనిపిస్తే ఆందోళన చెందాల్సిన విషయమే. టీనేజ్ పిల్లలను ఎప్పుడూ ఒంటిరిగా వదిలేయొద్దు.. పిల్లలు ఏం చేస్తున్నారూ? ఎన్నిగంటలు సోషల్ మీడియాలో గడుపుతున్నారూ ఇలాంటివన్నీ తల్లిదండ్రులు గమనిస్తూ ఉండాలి. వారిని సెల్ఫీలకు బానిసలుగా కాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
సాధారణంగా సెల్ఫీల కోసం కొంతమంది టీనేజ్ గర్ల్స్ తమ శరీరాకృతిని మార్చుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. సహజంగా ఉండాల్సిన శరీరంలో మార్పుల కోసం ప్రయత్నిస్తే అది వారి ప్రాణాలకు ముప్పు ఏర్పడే అవకాశం కూడా ఉంది. సోషల్ మీడియాలో పోస్టు చేసిన సెల్ఫీలకు నెగిటీవ్ కామెంట్లు వస్తే.. అవి చూసి తమపై అసహ్యాన్ని పెంచుకోవడమే కాదు.. తమ జీవితమై విర్తకి పొంది ఆత్మహత్యలకు కూడా ప్రేరేపించే ప్రమాదం లేకపోలేదు. ఇలాంటి భయానక విషయాలను పరిశోధక బృందం తమ అధ్యయనంలో గుర్తించింది.
14ఏళ్ల నుంచి 17 ఏళ్ల బాలికలపై సర్వే :
ఈ అధ్యయనాన్ని జనరల్ ఆఫ్ చిల్డ్రన్ అండ్ మీడియాలో ప్రచురించారు. సెల్ఫీలు ఎక్కువగా తీసుకునే 278 టీనేజ్ పిల్లల్లో 14 ఏళ్ల నుంచి 17 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న అమ్మాయిల అభిప్రాయాలపై ఆన్ లైన్ సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో చాలామంది టీనేజ్ గర్ల్స్ ఎంతమంది తమ సెల్ఫీలను తరచూ సోషల్ మీడియలో షేర్ చేస్తున్నారో వెల్లడించారు. అలాగే సెల్ఫీలను ప్రత్యేకమైన ఫొటో ఎడిటింగ్ టెక్నిక్స్ వాడుతున్నారో కూడా చెప్పారు.
అందమైన కళ్లు, స్కిన్ స్మూత్ చేయడం వంటి ఎన్నో ఫొటో ఫిల్టర్లను వాడుతున్నట్టు తెలిపారు. లావుగా ఉన్నామనే బాధపడే అమ్మాయిలంతా సన్నగా కనిపించేలా ఫొటో టెక్నిక్ లను వినియోగిస్తున్నట్టు చెప్పారు. సెల్ఫీలను సోషల్ మీడియాలో పోస్టు చేశాక వచ్చిన రెస్పాన్స్ బట్టి తమ ఆలోచన విధానాన్ని మార్చేసుకుంటున్నారు. ఫలితంగా ఏదైనా నెగటీవ్ కామెంట్లు తమ స్నేహితుల నుంచి లేదా ఫాలోవర్ల నుంచి వస్తే.. అది చూసి నిరూత్సాహ పడుతుంటారు. ఫలితంగా మానసికంగా కృంగిపోవడం, తీవ్ర ఒత్తిడి, సరిగా తినపోవడం సమస్యలు ఎక్కువగా ఉంటాయని పరిశోధకులు వెల్లడించారు.
రోజుకు 93 మిలియన్ల సెల్ఫీలు :
చిన్న వయస్సులోనే ఇలాంటి సమస్యలు ఎక్కువగా ఉంటే భవిష్యత్ లో మరిన్ని అనారోగ్య సమస్యలకు దారితీసే అవకాశం ఉంది. సెల్ఫీలను షేరింగ్ చేసే అమ్మాయిల్లో వారి ప్రవర్తనా శైలి ఒక్కోలా ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. పరిశోధకుల అంచనా ప్రకారం.. ప్రతిరోజు 93 మిలియన్ల సెల్ఫీలు తీసుకుంటున్నారని అంచనా. సెల్ఫీలు తీసుకోవడమనేది చెడు కాదు కానీ అది మనిషిని పీడించేదిలా ఉండకూడదని సూచిస్తున్నారు.