బాలీవుడ్ నటి మిష్తీ ముఖర్జీ(27) మృతికి కారణం కీటో డైట్.. అసలు కీటో డైట్ అంటే ఏంటి? ఎందుకంత డేంజర్ ?

  • Published By: naveen ,Published On : October 5, 2020 / 04:07 PM IST
బాలీవుడ్ నటి మిష్తీ ముఖర్జీ(27) మృతికి కారణం కీటో డైట్.. అసలు కీటో డైట్ అంటే ఏంటి? ఎందుకంత డేంజర్ ?

Updated On : October 5, 2020 / 4:17 PM IST

How risky is keto diet: బాలీవుడ్ నటి మిష్తీ ముఖర్జీ(27) మరణంతో.. మరోసారి కీటో డైట్‌‌పై డిబేట్ మొదలైంది. కిడ్నీ ఫెయిల్యూర్‌తో.. ఆమె చనిపోయారు. దీనికి కీటో డైటే కారణమని కుటుంబసభ్యులు చెబుతున్నారు. దీంతో.. కీటో డైట్ ఎంతవరకు సేఫ్ అన్న దానిపై అంతటా చర్చ మొదలైంది. అసలేంటి ఈ కీటో డైట్.? దీనిపై వైద్య నిపుణులు ఏమంటున్నారు?

కిడ్నీ ఫెయిల్యూర్‌తో మిష్తీ మృతి.. కిడ్నీ ఫెయిల్యూర్ వెనక కీటో డైట్
బెంగాలీ నటి మిష్తీ ముఖర్జీ.. ఇటీవలే(అక్టోబర్ 2,2020 రాత్రి) బెంగళూరులో తుదిశ్వాస విడిచారు. కిడ్నీ సమస్య కారణంగా ఆమె మృతి చెందారు. మెడికల్ రిపోర్టుల ప్రకారం.. ఆమె కిడ్నీలు పాడవటానికి కీటో డైటే కారణమని తేలింది. బెంగాలీ సినిమాలే కాదు.. బాలీవుడ్‌లోనే మిష్తీ మెరిశారు.

ఆమె తన నటనతో పాటు డ్యాన్స్‌తోనూ వేలాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. కీటో డైట్ కారణంగా ఆమె మృతి చెందడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మిష్తీ మృతితో.. కీటో డైట్ ఎంతవరకు సేఫ్ అన్న ప్రశ్న మరోసారి తలెత్తుతోంది.

అసలు కీటో డైట్‌ అంటే ఏంటి?
మనం తీసుకునే ఆహారంలో.. అతి తక్కువ కార్బోహైడ్రేట్స్‌, అధికంగా ప్రోటీన్లు, కొద్దిగా కొవ్వు పదార్థాలు తీసుకోవటమే కీటో డైట్‌ విధానం. కీటో డైట్‌లో.. కార్బోహైడ్రేట్స్‌ తక్కువగా లభించటంతో శరీరం తనకు అవసరమైన శక్తిని కొవ్వు నుంచి తీసుకుంటుంది. అందువల్ల.. శరీరానికి అవసరమయ్యే రోజువారీ కెలోరీ విలువలో 70 నుంచి 80 శాతం కొవ్వు పదార్థాల నుంచి, 20 శాతం ప్రోటీన్ల నుంచి మిగిలిన 5 శాతం కార్బోహైడ్రేట్ల నుంచి లభిస్తాయి.

బరువు తగ్గడం కోసమే కీటో డైట్:
ఈ కీటో డైట్ విధానం వల్ల.. ఎన్ని లాభాలున్నాయో.. అన్నే సమస్యలూ ఉన్నాయి. కీటో డైట్‌తో అతి త్వరగా బరువు తగ్గిపోతారనేది నిజం. అంతేకాదు.. అధిక బరువుతో వచ్చే ఆరోగ్య సమస్యలకు కూడా ఇది సమర్థంగా పనిచేస్తుందని చెబుతుంటారు. అయినప్పటికీ.. వైద్య నిపుణులు దీని పాటించే విషయంలో హెచ్చరిస్తున్నారు. కీటో డైట్ పాటించినప్పుడు.. శరీరానికి అత్యవసరమైన అనేక పోషకాలను తీసుకునే అవకాశం ఉండదు. కార్బోహైడ్రేట్లను తీసుకోవటం, మానేయటం వలన కొన్ని రకాల విటమిన్లు, పోలీఫెనాల్స్‌, పీచు పదార్థాలు శరీరానికి లభించవు.

గుండె పనితీరుకు, ఆరోగ్యానికి ఆ పోషకాలు అతి ముఖ్యమైనవని వైద్య నిపుణులు చెబుతున్నారు. పైగా కార్బో హైడ్రేట్లను తినకపోవటం వలన కొవ్వు మాత్రమే కాకుండా కండరాలు కూడా కరిగిపోతాయి. ఇది శరీరానికి మంచిది కాదంటున్నారు.

కీటో డైట్ తో త్వరగా బరువు తగ్గుతారు.. కానీ దుష్ప్రభావాలే ఎక్కువ:
కీటో డైట్ పాటించేటప్పుడు.. తీవ్రమైన అలసట, మళ్లీ బరువు పెరిగే అవకాశం, అధికమైన దాహం, మలబద్ధకం, ముఖ్యంగా కిడ్నీ సమస్యలు, గుండె సమస్యలు తలెత్తే ప్రమాదముందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కీటో డైట్‌ విధానంలో.. కార్బోహైడ్రేట్స్ తీసుకోకపోవడం వల్ల కాలేయం కొవ్వును కరిగించి.. దాని నుంచి శక్తిని పొందుతుంది. దీనివల్ల త్వరగా బరువు తగ్గుతారు. కానీ.. డాక్టర్లు, వైద్య నిపుణులు మాత్రం.. కీటో డైట్ వల్ల దుష్ప్రభావాలే ఎదురవుతాయంటున్నారు.

బరువు తగ్గటమనేది మనం తీసుకునే ఆహార నాణ్యత మీద తప్ప.. తీసుకున్న కేలరీల మీద ఆధారపడి ఉండదని న్యూట్రిషియన్లు చెబుతున్నారు. బరువు తగ్గటానికి, ఆరోగ్యంగా ఉండటానికి మధ్య తేడాను గుర్తించాలంటున్నారు.