అమ్మ కడుపు చల్లగా.. : 4 లక్షల మందికి కేసీఆర్ కిట్లు

హైదరాబాద్ : రాష్ట్రంలో మాతా, శిశు మరణాల నియంత్రణకు, ప్రసవాలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరిగేలా చూసేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన కేసీఆర్ కిట్ల పథకం రాష్ట్రంలో సమర్థ వంతంగా అమలవుతోంది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలుచేస్తున్న కేసీఆర్ కిట్ల పథకం అమలు తీరుకు జాతీయస్థాయిలో ప్రశంసలు అందుతున్నాయి. ఈ పధకాన్ని ఇతర రాష్ట్రాలు అమలు చేయాలని చూస్తున్నాయి. ఇటీవల కరీంనగర్ జిల్లా గంగాధరలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన జాతీయ నాణ్యతా ప్రమాణాల తనిఖీ బృందం , పధకం అమలుతీరును చూసి ప్రశంసించి,రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందించింది. ప్రభుత్వాసుపత్రిలో ప్రసవించినవారికి ఆడపిల్లపుడితే రూ.13 వేలు, మగ పిల్లాడు పుడితే రూ.12 వేలతోపాటు కేసీఆర్ కిట్ పేరిట రూ.2 వేల విలువైన 16 రకాల వస్తువులు 2017 జూన్ 3నుంచి ప్రభుత్వం అందచేస్తోంది.
ఈ పధకం అమలు మహిళల ఆరోగ్యానికి భరోసా కల్పిస్తోంది. తెలంగాణ ఈ పథకం అమలు చేయటం మొదలు పెట్టినప్పటి నుంచి ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరిగింది. 2017-18 ఆర్థిక సంవత్సరం తర్వాత 30 శాతం ఉన్న ప్రసవాలు 51 శాతానికి పెరిగాయి. ఈ ఏడాది ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాలు 58.63శాతానికి పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. 2017 జూన్ 3న కేసీఆర్ కిట్ల పథకం ప్రారంభమైంది. 2019 జనవరి చివరినాటికి 3లక్షల 92వేల 707 మంది బాలింతలు ఈ పథకం ద్వారా లబ్ది పొందారు. ఇందుకోసం రూ.472.24 కోట్లు ఖర్చు చేసింది. గర్భిణులు, బాలింతలకు పోషకాహారం కోసం రూ.393.50 కోట్లు ఖర్చు చేయగా, కేసీఆర్ కిట్లు అందజేసేందుకు రూ.78.74 కోట్లు ఖర్చు పెట్టారు. దేశంలోని ఏ రాష్ట్రం ఇలాంటి పథకాన్ని అమలు చేయటం లేదు.
రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత లక్ష్యంతో అమలు చేస్తున్న కేసీఆర్ కిట్ల పథకం ప్రారంభమైనప్పటి నుంచి సకాలంలో నగదు చెల్లిస్తున్నారు. ప్రసవానంతరం కేసీఆర్ కిట్లను ఎప్పటికప్పుడు అందించేందుకు వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. నవజాత శిశువుల సంరక్షణకోసం రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న కేసీఆర్ కిట్లను ప్రసవానంతరం జాప్యం లేకుండా అందించేందుకు అన్ని జిల్లా ఆసుపత్రుల్లో అందుబాటులో ఉంచారు. ఈనెల చివరి వరకు ప్రభుత్వ దవాఖానల్లో జరగనున్న ప్రసవాల సంఖ్య అంచనా ప్రకారం 31 జిల్లాల పరిధిలో 20వేల 562 కిట్లను అందుబాటులో ఉంచారు.