నవజాత శిశువుల గుండె, మెదడు, ఊపిరితిత్తుల్లో మైక్రోప్లాస్టిక్స్..! పరిశోధనలో భయంకరమైన నిజాలు..!
దీని బట్టి.. మైక్రో ప్లాస్టిక్స్ మానవాళికి ఎంత ప్రమాదకరంగా పరిణమిస్తున్నాయో అర్థం చేసుకోవాలని పరిశోధకులు హెచ్చరించారు.

Microplastics (Photo Credit : Google)
Microplastics : మైక్రోప్లాస్టిక్స్ డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. పర్యావరణానికే కాదు మనుషులకు కూడా హానికరంగా మారుతున్నాయి. కొత్త పరిశోధనలో భయంకరమైన వాస్తవాలు వెలుగుచూశాయి. ఆ పరిశోధన ప్రకారం.. నవజాత శిశువుల గుండె, మెదడు, ఊపిరితిత్తుల్లో మైక్రో ప్లాస్టిక్స్ కనుగొన్నారు. ఈ పరిణామం తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. మైక్రోప్లాస్టిక్ కణాలు గర్భిణుల నుండి పుట్టబోయే బిడ్డలకు చేరినట్లుగా పరిశోధనలో వెల్లడైంది.
నవజాత ఎలుకల ఊపిరితిత్తులు, గుండె, కాలేయం, మూత్రపిండాలు, మెదడులో చిన్న చిన్న ప్లాస్టిక్ ముక్కలను పరిశోధకులు గుర్తించారు. పాలిమైడ్-12 లేదా PA-12 వాటి తల్లి ఎలుకలు పీల్చడం ద్వారా ఈ ప్లాసిక్ ముక్కలు వాటిలో చేరినట్లుగా రట్జర్స్ విశ్వవిద్యాలయ పరిశోధకులు కొత్త అధ్యయనంలో వెల్లడించారు.
గర్భధారణ సమయంలో మైక్రో ప్లాస్టిక్స్ ప్లాసెంటా ద్వారా ప్రయాణించి పిండాన్ని చేరతాయని పరిశోధకులు గుర్తించారు. సైన్స్ ఆఫ్ ది టోటల్ ఎన్విరాన్‌మెంట్ జర్నల్‌లో ప్రచురించబడిన రట్జర్స్ హెల్త్ అధ్యయనం ప్రకారం.. ఆక్సీకరణ ద్వారా పర్యావరణంలోకి ప్రవేశించే సూక్ష్మ, నానోప్లాస్టిక్ కణాలు.. పీల్చడం, ఆహారం ద్వారా సులభంగా మానవ శరీరంలో నిక్షిప్తమవుతాయని పరిశోధకులు అర్థం చేసుకున్నారు. ఈ కాలుష్య కారకాలు ప్లాసెంటల్ అవరోధాన్ని దాటి పిండం కణజాలంలో చేరగలవని గుర్తించారు. అయితే.. శిశువు పుట్టిన తర్వాత చాలా కాలం పాటు ఈ కణాలు కణజాలంలో ఉన్నాయా లేదా అనేది దానిపై స్పష్టత లేదు.
పరిశోధకులు తొలుత ఆరు ఎలుకలపై ప్రయోగం చేశారు. గర్భధారణ సమయంలో ఏరోసోలైజ్డ్ ఫుడ్-గ్రేడ్ ప్లాస్టిక్ పౌడర్ కి వాటిని 10 రోజుల పాటు ఎక్స్‌పోజ్ చేశారు. ఈ క్రమంలో ప్లాస్టిక్ కణాలు ఎలుకల అవయవాల్లోకి చేరినట్లుగా గుర్తించారు. ఆ ఎలుకలకు పుట్టిన నవజాత ఎలుకలపై పరిశోధకులు టెస్టులు చేశారు. మైక్రో, నానోప్లాస్టిక్ ఎక్స్పోజర్ కోసం పరీక్షలు చేయగా.. గర్భధారణ సమయంలో వాటి తల్లులు పీల్చిన ప్లాస్టిక్ కణాలు.. పిల్లల ఊపిరితిత్తులు, కాలేయం, మూత్రపిండాలు, గుండె, మెదడు కణజాలంలోనూ కనుగొనబడ్డాయి. దీని బట్టి.. మైక్రో ప్లాస్టిక్స్ మానవాళికి ఎంత ప్రమాదకరంగా పరిణమిస్తున్నాయో అర్థం చేసుకోవాలని పరిశోధకులు హెచ్చరించారు. పర్యావరణానికి చేటు చేయడమే కాకుండా మానవాళికి కూడా ఆపద పొంచి ఉందని అంటున్నారు. పర్యావరణానికి ముప్పుగా మారిన మైక్రో ప్లాస్టిక్స్.. దీర్ఘ కాలంలో గర్భిణులు, నవజాత శిశువులు ఆరోగ్యంపై తీవ్రమైన దుష్ప్రభావం చూపుతున్నట్లు పరిశోధనలో తేలింది.
Also Read : ప్రతిరోజూ కొద్దిగా డార్క్ చాక్లెట్ తింటే.. బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా? అధ్యయనాలు ఏం చెబుతున్నాయంటే?