కాలేయం..జర భద్రం

  • Published By: veegamteam ,Published On : April 19, 2019 / 07:59 AM IST
కాలేయం..జర భద్రం

Updated On : April 19, 2019 / 7:59 AM IST

శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవాల్లో కాలేయం ఒకటి. ఇది ఏ మాత్రం దెబ్బతిన్నా.. శరీరం అదుపు తప్పుతుంది. కొన్నేళ్లుగా కాలేయ వ్యాధి గ్రస్తుల సంఖ్య క్రమేనా పెరుగుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. లివర్ సమస్యలు తీవ్రమవుతుండటంతో లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయించుకునేవారి సంఖ్య కూడా పెరుగుతోంది. ప్రతి యేటా ఏప్రిల్ 19న ప్రపంచ కాలేయ దినోత్సవాన్ని జరుపుకుంటున్న నేపథ్యంలో స్పెషల్ స్టోరీ.

శరీరంలో  కాలేయం … రెండో అతి పెద్ద అవయవం. జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిచేయాలంటే కాలేయం పనితీరు బాగుండాలి. అయితే భారత్‌లో అత్యధిక మంది కాలేయ వ్యాధి బారిన పడి తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నట్లు గణంకాలు తెలుపుతున్నాయి. ఒకప్పుడు హెపటైటీస్ బీ, సీ వల్ల మాత్రమే కాలేయ సమస్యలు వచ్చేవి. కాని ఇప్పుడు మారుతున్న జీవనశైలి వల్ల లివర్ సమస్యలు పెరుగుతున్నాయి. 

సాధారణంగా జీర్ణకోశ నాళము నుంచి వచ్చే రక్తాన్ని కాలేయం వడపోస్తుంది. ఆ తర్వాతే రక్తం శరీరంలోని అన్ని భాగాలకు సరఫరా అవుతుంది. అలాగే మనం తీసుకున్న ఆహారం వల్ల వచ్చే వ్యర్ధాలను తొలగించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా ఇన్ఫెక్షన్లు, కొవ్వులు, బ్లడ్ షుగర్లను కాలేయం నియంత్రిస్తుంది. అయితే మారుతున్న ఆహారపుటలవాట్లతో కొన్నేళ్లుగా మధ్య వయస్సు వారు, యువతలో ఎక్కువమంది లివర్ సమస్యలతో బాధపడుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు.  

పదిహేనేళ్లుగా ఒక ప్రైవేటు ఆస్పత్రిలోనే  7వందల లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ లు జరిగాయంటే ఏ రేంజ్ లో కాలేయమార్పిడి ఆపరేషన్లు  జరుగుతున్నాయో అర్ధమవుతోంది. అయితే ప్రైవేటు హాస్పిటల్స్  పిడియాట్రిక్ లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కూడా ఎక్కువగానే చేస్తున్నాయి. ఈ కాలేయ మార్పిడికి దాదాపుగా 25 లక్షల రూపాయలు ఖర్చు అవుతున్నాయి. 

ఒక్క హైదరాబాద్‌లోనే సంవత్సరానికి వందల సంఖ్యలో లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్లు జరుగుతుండటంతో సర్వత్రా  ఆందోళన వ్యక్తమవుతోంది. ఆల్కహాల్ ప్యాటీ లివర్, హెపటైటిస్ వంటి సమస్యలతో బాధపడేవారు ముందుగానే తగు జాగ్రత్తలు తీసుకుంటే ట్రాన్స్‌ప్లాంటేషన్ వరకూ వెళ్లకుండా తమను కాపాడుకోవచ్చని డాక్టర్లు సూచిస్తున్నారు.