మా ఊరికి రావద్దు..మా హోటల్లో దిగొద్దు… కరోనా ఎఫెక్ట్

చైనాలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర కల్లోలం సృష్టిస్తోంది. అంతుబట్టని ఈ మహమ్మారి సోకి ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఇప్పటిదాకా మొత్తం 635 మంది చనిపోయినట్టు చైనా వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది.
2019డిసెంబర్ నెలాఖరు నుంచి ఇప్పటివరకు 25కి పైగా దేశాలకు వ్యాపించిన ఈ ‘కరోనా’తో బాధితుల సంఖ్య 30వేల 852కి చేరింది. దీంతో ప్రపంచ దేశాలన్నీ వైరస్ భయంతో వణుకుతున్నాయి. గురువారం, ఫిబ్రవరి6, ఒక్కరోజే హుబేయి ప్రావిన్స్‌లో సుమారు 70 మంది చనిపోగా… కొత్తగా 3వేల 156 కేసులు నమోదైనట్టు అధికారులు ప్రకటించారు.
ఇక భారత్ లోనూ coronavirus వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. చైనా, హాంకాంగ్ నుంచి వచ్చే ప్రయాణికులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తోంది. మరో వైపు coronavirus వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాల హోటల్స్ అసోసియేషన్ (Hotels association of Dharmashala ) సంచలన నిర్ణయం తీసుకుంది. coronavirus వ్యాపించిన చైనాతో పాటు ఆసియా దేశాలకు చెందిన విదేశీ పర్యాటకులు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని ధర్మశాలలో పర్యటించవద్దని హోటల్ అసోసియేషన్ కోరింది.
విదేశీ పర్యాటకులు ధర్మశాల పర్యటనలను వాయిదా వేసుకోవాలని హోటల్ అసోసియేషన్ (Hotels association of Dharmashala ) అధ్యక్షురాలు అశ్వనీ బంబా సూచించారు. ధర్మశాలలోని హోటళ్లలో బస చేసిన విదేశీ పర్యాటకుల వద్ద నుంచి డిక్లరేషన్ లు తీసుకుంటున్నామని పర్యాటక శాఖ డిప్యూటీ డైరెక్టరు సునయన శర్మ చెప్పారు. coronavirus ప్రబలుతున్న నేపథ్యంలో ఈ ఏడాది జనవరి 1వతేదీ నుంచి చైనాతోపాటు ఆసియా దేశాల నుంచి వచ్చిన పర్యాటకుల జాబితాను తయారు చేయాలని కేంద్రం ఆదేశించింది.
కాంగ్రా జిల్లాలో 20 మంది చైనా వాసులు ధర్మశాలలో పర్యటిస్తున్నారని తేలడంతో వారికి వైద్యపరీక్షలు చేయించి 14 రోజుల పాటు వైద్యుల పరిశీలనలో ఉండాలని అధికారులు ఆదేశించారు. coronavirus ప్రబలిన నేపథ్యంలో పర్యాటక ప్రాంతాల్లో విదేశీ అతిథుల నుంచి డిక్లరేషన్ లు తీసుకోవాలని అధికారులు ట్రావెల్ ఏజెంట్లను ఆదేశించారు.
coronavirus అనుమానితులు సిమ్లాలోని ఇందిరా గాంధీ మెడికల్ కాలేజీ (ఐజిఎంసి), తాండాలోని డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ప్రభుత్వ వైద్య కళాశాల (ఆర్‌పిజిఎంసి) లో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ వార్డుల్లో వైరస్ పరీక్షలు చేయించుకోవాలని హిమాచల్ ప్రదేశ్ ప్రధాన కార్యదర్శి అనిల్ ఖాచి సూచించారు. జనవరి 15 తరువాత చైనా నుండి హిమాచల్ ప్రదేశ్ తిరిగి వచ్చిన వారెవరైనా ఉంటే వారి కుటుంబ సభ్యులు హెల్ప్‌లైన్ నంబర్ 104 కు తెలియజేయాలని ఆయన రాష్ట్ర ప్రజలకు సూచించారు.
సిమ్లా జిల్లాలో చైనా మరియు ఇతర ప్రభావిత దేశాల నుండి గరిష్టంగా 32 మంది తిరిగి వచ్చారు, తరువాత కాంగ్రాలో 20 మంది, సోలన్లో 18 మంది ఉన్నారు. కరోనా వైరస్ పై కాంగ్రా జిల్లా పరిపాలన యంత్రాంగం పూర్తి స్థాయి అప్రమత్తతతో ఉంది. బైజ్ నాథ్ సమీపంలోని ధర్మశాల, మెక్లియోడ్గంజ్, పాలంపూర్ మరియు బిర్ గ్రామాలను అధిక సంఖ్యలో విదేశీ సందర్శకులు వస్తుంటారు. ఈ ప్రాంతాల్లో వైరస్ వ్యాప్తి అయ్యే అవకాశం ఉందని అధికారులు గుర్తించారు.
టిబెటన్ ఆధ్యాత్మిక నాయకుడు దలైలామా నివాసం అయిన మెక్లియోడ్‌గంజ్‌ను ప్రపంచం నలుమూలల నుండి, ముఖ్యంగా చైనా మరియు ఆగ్నేయ ఆసియా నుండి భక్తులు సందర్శిస్తారు. ధర్మశాల మరియు పరిసర ప్రాంతాలను సందర్శించే పర్యాటకులనుంచి గత 15 రోజులగా వారి ఆరోగ్య సంబంధిత వివరాలు..ప్రయాణ వివరాలను తీసుకుంటున్నామని జిల్లా పర్యాటక అభివృద్ధి అధికారి సునైనా శర్మ చెప్పారు.