పాముల నుంచే కరోనా వైరస్…వూహాన్ సిటీకి తాళం

  • Published By: venkaiahnaidu ,Published On : January 24, 2020 / 02:44 AM IST
పాముల నుంచే కరోనా వైరస్…వూహాన్ సిటీకి తాళం

Updated On : January 24, 2020 / 2:44 AM IST

చైనాలోని వుహాన్‌ నగరంలో వెలుగులోకి వచ్చిన కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచదేశాలను భయపెడుతోంది. ఇప్పటివరకు వందల సంఖ్యలో ప్రజలు చైనాలో ఈ వైరస్‌ బారిన పడగా, నేటికి 25మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికే థాయ్ లాండ్,జపాన్,దక్షిణ కొరియాలను తాకిన ఈ బ్యాక్టీరియా… తాజాగా సౌదీకీ పాకింది. అయితే ఈ వైరస్ కి సంబంధించిన కీలక విషయాలు బయటికొచ్చాయి. ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్​ పాముల నుంచి పాకినట్లు తెలుస్తోంది. అది కూడా ఆ వైరస్​కు మూలమైన చైనా సిటీ వుహాన్​ నుంచే మనుషుల్లోకి వచ్చిందట. చైనాలోని పెకింగ్​ యూనివర్సిటీ ఆఫ్​ హెల్త్​ సైన్స్​ సెంటర్​ స్టడీలో ఈ విషయం వెల్లడైంది. 

పాముల నుంచేనట!

వుహాన్​లోని మార్కెట్లలో చేపలు, పందులతో పాటు పాములను కూడా అమ్ముతారు. వాటిని జనం తినడం వల్లే వైరస్​ పాకిందని యూనివర్సిటీ రీసెర్చర్​ వీ జి చెప్పారు. కొత్త కరోనా వైరస్​ జీన్స్​ను పాత కరోనా వైరస్​ జీన్స్​తో పోల్చి చూసిన సైంటిస్టులు ఈ నిర్ధారణకు వచ్చారు. ఆ వైరస్​ ఉండే భౌగోళిక ప్రాంతాలు, వాటికి హోస్టులుగా ఉండే జంతువులను పరీక్షించారు. గబ్బిలాల్లో ఉండే కరోనావైరస్​ జీన్స్​ కాంబినేషన్​తో ఈ కొత్త కరోనా పుట్టుకొచ్చిందని తేల్చారు. అంతేగాకుండా పాముల్లోని జీన్స్​తోనూ వాటిని పోల్చి చూసి, పాముల నుంచి వచ్చి ఉంటుందని చెబుతున్నారు.

మనుషులకు సోకడానికి ముందు పాముల్లోనే ఎక్కువగా ఆ వైరస్​ ఉండి ఉంటుందని అనుమానిస్తున్నారు. అన్ని ఫలితాలను పరిశీలించాక పాముల వల్లే ఈ కొత్త కరోనా వైరస్​ సోకి ఉంటుందని భావిస్తున్నామని తమ రిపోర్టులో సైంటిస్టులు తెలిపారు. బీజింగ్​లోని చైనీస్​ అకాడమీ ఆఫ్​ సైన్సెస్​ చేసిన స్టడీలోనూ ఈ విషయమే వెల్లడైంది. కొత్త కరోనా వైరస్​కు పాములు, గబ్బిలాలే కారణమని ఆ స్టడీ తేల్చింది. అయితే, పాములు లేదా గబ్బిలాల నుంచి ఆ వైరస్​ మనుషులకు ఎలా సోకిందో మాత్రం రెండు స్టడీలూ తేల్చలేదు. నిపుణులు మాత్రం వుహాన్​ సిటీలో చాలా మంది పాము మాంసం తింటారని, వాటిని తినడం వల్లే వైరస్​ సోకి ఉంటుందంటున్నారు.

వూహాన్ సిటీకి తాళం
వైరస్​కు మూలకారణమైన వుహాన్​ సిటీకి రాకపోకలను చైనా బంద్​పెట్టింది. కోటి మందికిపైగా ఉండే వుహాన్​ నుంచి వేరే సిటీలు, దేశాలకు వెళ్లే ఫ్లైట్లు, వేరే సిటీల నుంచి అక్కడకు వచ్చే విమానాలన్నింటినీ రద్దు చేసేసింది. రైళ్లు, బస్సులనూ గురువారం ఆపేసింది. ఆయా సిటీల నుంచి వైరస్​లు వేరే ప్రాంతాలకు వ్యాపించకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని అధికారులు చెబుతున్నారు. దీంతో చివరి ఫ్లైట్​, చివరి ట్రైన్​ను అందుకునేందుకు ప్రయాణికులు అవస్థలు పడ్డారు. నగరంలో మిగిలిపోయిన ప్రజలు నిరాశతో ఫుడ్ ని నిల్వ చేసుకున్నారు.

నగరంలోని ప్రజలు కూడా సామాగ్రిని నిల్వ చేయడానికి పరుగెత్తారు. స్టోర్ లలో ఉన్న మాంసం,కూరగాయలు,ఇన్ స్టాంట్ న్యూడిల్స్ వంటివి మొత్తాన్ని తీసుకెళ్లారు. అంతేగాకుండా కేఫెలు, సినిమా థియేటర్లు, ఎగ్జిబిషన్​ సెంటర్లు, షాపింగ్​ మాళ్లన్నింటినీ మూసేశారు. ఒక వ్యక్తి చైనీస్ సోషల్ మీడియాలో….ప్రస్తుతం ప్రజలు ప్రజలు సరఫరాపై పోరాడుతున్నారు. త్వరలో అది ఫైటింగ్ గా ఉండవచ్చుని తెలిపాడు.

వైరస్ కు వ్యాక్సిన్
కరోనా వైరస్​కు వ్యాక్సిన్​ను కనిపెట్టే పనిలో ఉన్నారు అమెరికా సైంటిస్టులు. బేలర్​ కాలేజ్​ ఆఫ్​ మెడిసిన్​కు చెందిన ట్రాపికల్​ మెడిసిన్​ రీసెర్చర్లు వ్యాక్సిన్​పై రీసెర్చ్​ చేస్తున్నారు. అయితే, ఇప్పుడప్పుడే వ్యాక్సిన్​ అందుబాటులోకి రాదని, మరో ఆరేళ్లయినా పడుతుందని ట్రాపికల్​ మెడిసిన్​ విభాగం డీన్​ డాక్టర్​ పీటర్​ హోటెజ్​ చెప్పారు. కరోనావైరస్​ సోకిన 2003 నుంచే వ్యాక్సిన్​పై పరిశోధనలు మొదలయ్యాయని, వైరస్​ తీవ్రత తగ్గగానే ఇన్వెస్టర్లు వెనకడుగు వేశారని అన్నారు. ఇప్పుడు మళ్లీ కొత్త రకం వైరస్​ పుట్టుకురావడంతో రీసెర్చ్​ చేస్తున్నారని వివరించారు.

గ్లోబల్ ఎమర్జెన్సీ!

వైరస్​పై ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికారులతో సమావేశాలు నిర్వహిస్తోంది. గ్లోబల్​ ఎమర్జెన్సీగా ప్రకటించాలన్న అధికారుల వాదనను డబ్ల్యూహెచ్​వో కొట్టి పారేసింది. ‘‘ఇప్పటికిప్పుడు దీనిని గ్లోబల్​ హెల్త్​ ఎమర్జెన్సీగా ప్రకటించలేం. దానిపై మరింత సమాచారం కావాలి. దీనిపై ఎమర్జెన్సీ కమిటీ మరోసారి సమావేశమై డిసైడ్​ చేస్తే బాగుంటుంది’’ అని డబ్ల్యూహెచ్​వో చీఫ్​ టెడ్రోస్​ అధనోం ఘెబ్రియెసస్​ అన్నారు. చైనా తీసుకుంటున్న చర్యలతో వైరస్​ వ్యాప్తి చెందడం తగ్గుతుందన్నారు.