2022 చివరిలో ప్రపంచవ్యాప్తంగా 70 శాతం మందికి కరోనా వ్యాక్సిన్‌!

  • Published By: sreehari ,Published On : October 6, 2020 / 04:59 PM IST
2022 చివరిలో ప్రపంచవ్యాప్తంగా 70 శాతం మందికి కరోనా వ్యాక్సిన్‌!

Updated On : October 6, 2020 / 5:05 PM IST

Soumya Swaminathan: కరోనా వైరస్‌ అంతం చేసే వ్యాక్సిన్‌లు ప్రపంచ జనాభాలో 70శాతం మందికి చేరాలంటే మరో రెండేళ్లు పడుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) సైంటిస్టు సౌమ్య స్వామినాథన్ వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్‌- 19 నిర్మూలన కోసం దాదాపు 40 వ్యాక్సిన్లపై క్లినికల్‌ ట్రయల్స్‌ జరుగుతున్నాయని ఆమె చెప్పారు.



అందులో 9 వ్యాక్సిన్లు రెండు, మూడవ దశ పరీక్షల్లో ఉన్నాయని వెల్లడించారు. వ్యాక్సిన్ ట్రయల్స్ చేస్తున్న చాలా ఫార్మా కంపెనీలు తమ పరీక్షల్లో వెల్లడైన అంశాలను 2020 చివరిలో లేదా వచ్చే ఏడాది 2021 ఆరంభంలో వెల్లడించే అవకాశం ఉందన్నారు.



ప్రపంచవ్యాప్తంగా జనాభాలో 60శాతం నుంచి 70 శాతం మంది ప్రజలకు వ్యాక్సిన్‌ అందడానికి ఎంతైనా రెండేళ్ల సమయం పట్టొచ్చునని సౌమ్య వెల్లడించారు. 2022 ఆరంభంలో కాదు.. ఆ ఏడాది ఆఖరిలోనే 70 శాతం ప్రజలకు వ్యాక్సిన్ అందే అవకాశం ఉందని అంచనా వేశారు.



భారత్‌ సహా పలు దేశాల్లో కోవిడ్‌-19 వ్యాక్సిన్‌లు కొన్ని డాలర్ల ధరకే అందుబాటులో ఉంటాయని తెలిపారు. రాబోయే శీతాకాలంలో వైరస్‌ బారినపడకుండా ప్రజలు పలు జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె సూచించారు. మాస్క్‌లు ధరించడంతో పాటు భౌతిక దూరం పాటించాలని సూచించారు. ఇక చేతులు శుభ్రపరుచుకోవడం, గాలి, వెలుతురు లేని ప్రాంతాల్లో ఉండకుండా జాగ్రత్త పడాలని సౌమ్య స్వామినాథన్ సూచించారు.