కరోనా కేర్ : ఆ ఏడు దేశాల నుంచి వచ్చే వారిని అనంతగిరి రిసార్ట్ కే

దేశంలో కోవిడ్ వైరస్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చైనా, ఇటలీ, ఇరాన్, ఫ్రాన్స్, స్పెయిన్, జర్మనీ, దక్షిణ కొరియా దేశాల్లో కోవిడ్ వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్నదృష్ట్యా ఆ దేశాలను అత్యంత ప్రమాదకరమైన, హైరిస్క్ దేశాలుగా పరిగణించింది.
ఆ ఏడు దేశాల నుంచి హైదరాబాద్ ఎవరొచ్చినా, వారికి కోవిడ్ లక్షణాలు ఉన్నా లేకున్నా ప్రత్యేకంగా ఐసోలేషన్‌లో ఉంచాలని శుక్రవారం నిర్ణయించింది. ఆ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులను రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి నేరుగా వికారాబాద్ జిల్లా అనంతగిరిలో తెలంగాణ టూరిజం ఆధ్వర్యంలో నడిచే హరిత వ్యాలీ వ్యూ రిసార్ట్‌కు తరలించాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు నిర్ణయించారు.
ఆ ఏడు దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు అవసరమైన ఆహారం, ఇతర వసతులను సైతం రాష్ట్ర ప్రభుత్వమే ఏర్పాటు చేయనుంది. వారిని 14 రోజులపాటు వైద్యుల పర్యవేక్షణలో ఉంచి వారికి వైరస్ లేదని నిర్ధారణ అయ్యాక ఇళ్లకు పంపించునున్నారు. ఒకవేళ ఎవరికైనా కోవిడ్ లక్షణాలుంటే వెంటనే వారిని గాంధీ లేదా ఇతర నిర్ణీత ప్రభుత్వ కోవిడ్ చికిత్స అందించే చోటుకు పంపనుంది.(అమెరికాకు 5లక్షల కరోనా కిట్లను విరాళంగా ఇచ్చిన Alibaba )
ఇప్పటికే ఏ దేశం నుంచైనా హైదరాబాద్ చేరుకున్న వారు 14 రోజులపాటు ఇళ్లకే పరిమితమయ్యేలా చర్యలు చేపట్టిన ప్రభుత్వం… ఈ ఏడు దేశాల నుంచి వచ్చే ప్రయాణికులను మాత్రం నేరుగా తమ పర్యవేక్షణలోనే ఉండేలా ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే హరిత రిసార్టును శుభ్రం చేయించి అవసరమైన వైద్య పరికరాలను సిద్ధం చేసింది. ఒకవేళ ఈ దేశాల నుంచి వచ్చే వారి సంఖ్య పెరిగినా, ఇతర దేశాల నుంచి వచ్చే వారిలో ఎవరికైనా అనుమానిత లక్షణాలున్నా వారిని ఐసొలేషన్‌లో ఉంచే విషయంలో సర్కారు అనేక ప్రత్యామ్నాయాలు ఆలోచిస్తోంది.
నగరానికి దూరంగా ఉండే దూలపల్లిలోని ఫారెస్ట్ అకాడమీ వంటి ప్రభుత్వ శిక్షణ సంస్థలనూ ఐసొలేషన్ కేంద్రాలుగా ఎంపిక చేయాలని భావిస్తోంది. మరీ అవసరమైతే ఇప్పటికే పూర్తయిన దాదాపు 40 వేల డబుల్ బెడ్రూం ఇళ్లను కూడా వాడుకొనేలా ఏర్పాట్లు చేయాలనుకుంటోంది.
కాగా, శుక్రవారమే 17 మంది విమాన ప్రయాణికులను ప్రత్యేక వాహనంలో హరిత రిసార్ట్‌కు తరలించినట్లు తెలుస్తోంది. మరోవైపు అనంతగిరి ప్రాంతంలో ప్రత్యేక ఐసొలేషన్ ఏర్పాటుపై స్థానికులు ఆందోళన చెందుతున్నారు. పర్యాటక కేంద్రమైన అనంతగిరిలో ఐసొలేషన్ కేంద్రం వల్ల స్థానికంగా వైరస్ వ్యాపించే ప్రమాదం ఉందంటూ పలువురు హరిత రిసార్ట్ వద్ద నిరసన చేపట్టారు.