బతుకమ్మ చీరలు వచ్చేశాయ్ : సూర్యాపేట జిల్లాలో బ్రేక్

బతుకమ్మ చీరల పంపిణీకి అధికారులు అన్నీ సిద్దం చేశారు. ఈ సంవత్సరం 1.02 కోట్ల చీరలను పంపిణీ చేయాలని ప్రభుత్వం టార్గెట్ పెట్టుకుంది. సెప్టెంబర్ 23వ తేదీ సోమవారం నుంచి వీటిని పంపిణీ చేయనున్నారు. నల్గొండలో మంత్రి కేటీఆర్ దీనిని ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులను సీఎం కేసీఆర్ ఆదేశించారు.
ఇప్పటికే 75 లక్షల చీరలను జిల్లాల వారీ కోటాకు అనుగుణంగా సరఫరా చేశారు. అయితే..హుజూర్ నగర్ ఉప ఎన్నిక మూలంగా జిల్లాలో ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. దీని కారణంగా అక్కడ చీరల పంపిణీ కార్యక్రమం ఉండదు. సిరిసిల్లలోని 26 వేల మగ్గాలపై ఆధారపడిన 16 వేల మంది కార్మికులకు లబ్ది చేకూరుతున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది బతుకమ్మ చీరల తయారీ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 313 కోట్లు కేటాయించింది.
బతుకమ్మ చీరల తయారీలో భాగంగా 670 లక్షల మీటర్ల వస్త్రాన్ని ఉత్పత్తి చేయాలని అధికారులు నిర్ణయించారు. సెప్టెంబర్ 30వ తేదీ నాటికి లక్ష్యాన్ని చేరుకొనేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. నిఫ్ట్‌కు చెందిన నిపుణులు విభిన్న రంగుల్లో వంద రకాలైన జరీ అంచు చీరలను డిజైన్ చేశారు. యువతులు, మధ్య వయస్కుల కోసం ఆరు గజాలు, ఉత్తర తెలంగాణాలో వృద్ధ మహిళలు ధరించే వీలుగా తొమ్మిది గజాల పొడవు ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు.
చీరల పంపిణీ ఎవరు చేయాలనే దానిపై ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వార్డు స్థాయిలో బిల్ కలెక్టర్, వార్డు మహిళా సంఘం ప్రతినిధి, రేషన్ డీలర్ సభ్యులుగా ఉండి చీరలను పంపిణీ చేస్తారు. గత రెండేళ్లలో 1.90 కోట్ల చీరలను పంపిణీ చేయగా..ఇప్పటి వరకు రూ. 715 కోట్లను వెచ్చించింది ప్రభుత్వం.