ఫోన్ తోనే ఏదైనా.. మధ్యతరగతి వారికి అందుబాటులో!

సాధారణంగా ఇంటికి ఏ రంగు వేస్తే బాగుంటుంది. ఎలాంటి అలంకరణ హంగులు బాగుంటాయి వంటి విషయాలు ఎక్కువగా ఆలోచిస్తాం. వీటితోపాటు ఇంటిల్లిపాదికీ సురక్షితంగా ఉండాలంటే ఇంటి ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? పిల్లలు ఆడుకొనే బాల్కానీ గోడలు మొదలుకొని వంటింట్లో అదనపు సిలిండర్ భద్రపరచుకునేవరకు సురక్షిత మార్గాలను ఎంచుకుంటాం. అలాగే ఇంట్లో ఫ్యాన్, లైట్లు ఆపివేయడం.. తలుపులు మూయడం వంటివి కూడా ఆలోచించవలసిందే. ఎక్కడికైనా వెళ్లినప్పుడు ఇంట్లో ఫ్యాన్లు లైట్లు ఆపలేదేమో..? డోర్ వేయలేదేమో అనే చింత ఇంక అక్కర్లేదు. ఇలాంటి వాటన్నింటికీ ఓ పరిష్కారం మన ముంగిటకు వచ్చేసింది. ఆ పరిష్కారం పేరే ‘బి.వన్ ఈజీ’. అవును దీని సాంకేతికత సాయంతో ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సరే.. మీ ఇంట్లోని ఫ్యాన్లు, లైట్లు ఆన్ లేదా ఆఫ్ చేసేయొచ్చు. ఒకే ఒక్క మాటతో టీవీలో మీకిష్టమైన సినిమా చూడవచ్చు. తలుపులు మూయడం మర్చిపోయి వెళ్తే మూయవచ్చు. ఇందుకోసం ఏ మంత్రమూ వెయ్యక్కర్లేదు. పెరిగిన టెక్నాలజీ అటువంటిది మరి. బ్లేజ్ ఆటోమేషన్ అనే కంపెనీ బి.వన్ ఈజీ పేరుతో ఓ యూనివర్సల్ రిమోట్‌ను విడుదల చేసింది.
మధ్య తరగతి వారికి కూడా అందుబాటులో చాలా చౌకగా ఈ బి.వన్ ఈజీను కంపెనీ మార్కెట్లోకి అంతుబాటులోకి తెచ్చింది. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న బ్లేజ్ ఆటోమేషన్ శుక్రవారం బి.వన్ ఈజీని మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ గాడ్జెట్ సార్వత్రిక రిమోట్ కంట్రోలర్ అన్నమాట. మన టీవీ రిమోట్ కంట్రోలర్ ముందువైపు ఉండే ఎర్రటి బల్బు ఉంటుంది కదా? అది ఇన్ఫ్రారెడ్ రేస్ ఆధారంగా పనిచేస్తాయి. ఆ రేస్ మాదిరిగానే ఒక్కో రిమోట్‌కు ఒక్కో ప్రత్యేకమైన కోడ్ ఉంటుంది. బి.వన్ ఈజీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న దాదాపు 2 లక్షల గాడ్జెట్‌ల కోడ్‌లను గుర్తించి అందుకు తగ్గట్లుగా పనిచేస్తుంది. అంటే ఏ కంపెనీకి చెందిన టీవీ, ఏసీ, మ్యూజిక్ ప్లేయర్ అయినా సరే వాటిని ఓ స్మార్ట్‌ఫోన్ యాప్ సాయంతో ప్రపంచంలోని ఏ మూలనుంచైనా నియంత్రించవచ్చు. ఇంటర్నెట్ ఆధారిత గాడ్జెట్లు అవసరం లేకుండా ప్రస్తుతం ఉన్న వాటినే స్మార్ట్‌గా మార్చేందుకు ఓ ప్లగ్ అభివృద్ధి చేసినట్లు సంస్థ చెబుతుంది.
ఈ బి.వన్ ఈజీతో ఇంటికి ఎవరైనా వచ్చారనే విషయాన్ని వెంటనే గమనించొచ్చు. నేరుగా తాళం తెరవడంతో పాటు అవసరమైతే కొంత సమయం వరకు వ్యక్తులను లోపలికి అనుమతించేలా నియంత్రించవచ్చు. గుడ్‌నైట్ అనగానే కర్టెన్లు మూసుకుపోవడం, టీవీ ఆగడం, ఏసీ ఆన్ అవడం, బెడ్‌ల్యాంపులు వెలగడం వంటివి జరిగేలా చేసుకోవచ్చు. అలాగే ఇంటికి అపరిచిత వ్యక్తులు వచ్చినప్పుడు ఆ సమాచారాన్ని మీకు చేరవేసే సౌకర్య కల్పిస్తోంది బి.వన్ ఈజీ. ప్రస్తుత అంచనాల ప్రకారం బి.వన్ ఈజీతో రెండు బెడ్‌రూమ్‌ల ఇంటి ఆటోమేషన్‌కు రూ.25 వేల నుంచి రూ.75 వేల వరకూ ఖర్చు అవుతుంది. ఇప్పటి వరకు అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్‌లలో మాత్రమే అందుబాటులో ఉన్న బి.వన్ ఈజీ ఈ నెల నుంచి భారత్‌లోనూ అందుబాటులోకి రానుంది.