రైతుల ఆవేదన : లంచాలు ఇవ్వాలంటున్న అధికారులు

తెలంగాణ రాష్ట్రం అవినీతి రహితంగా మారాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారు. రెవెన్యూ కార్యాలయాలు, పురపాల సంఘాలు, గ్రామ పంచాయితీల్లో ఎవరికీ ఒక్క పైసా కూడా లంచం ఇవ్వొద్దని..కొత్త రెవెన్యూ చట్టం తీసుకొస్తామని చెబుతున్నారు. అయితే అధికారుల తీరు మాత్రం మారడం లేదు. రైతుల వద్ద లంచాలు అడుగుతున్నారు. డబ్బులు ముట్టచెప్పకపోతే పనులు చేయమని ఖరాఖండిగా చెబుతున్నారు. దీనితో రైతులు తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.
మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని తహసీల్దార్ ఆఫీసులో అధికారుల భాగోతం బయటపడింది. పట్టా చేయమని అడిగితే తన వద్ద నుంచి లంచం డిమాండ్ చేశారని ఓ రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. వేమనపల్లి మండలం నీల్వాయికి చెందిన కుడుకల బాపు అనే రైతుకు… జనగామ గ్రామంలో సర్వే నంబర్ 76లో రెండున్నర ఎకరాలు, సర్వే నంబర్ 72లో 39 గుంటల భూమి ఉంది. ఈ భూమిని తన భార్య పేరిట పట్టా చేయించడం కోసం రైతు ఏడాది నుంచి తహసీల్దార్ ఆఫీసు చుట్టూ తిరుగుతున్నా అధికారులు పట్టించుకోవడలేదు. పైగా లంచం ఇస్తేనే పని పూర్తవుతుందని…. అధికారులు తమను కార్యాలయం చుట్టూ తిప్పించుకుంటున్నారని బాధితులు వాపోతున్నారు.
మరోవైపు మెదక్ జిల్లా తుఫ్రాన్ మండలం వెంకటాపూర్‌లో కొందరు రైతులు ఆత్మహత్యాయత్నం చేశారు. సర్వేయర్ శశికాంత్ తమను లంచం కోసం వేధిస్తున్నాడని ఆరోపించారు. సర్వేయర్ వేధింపులు తట్టుకోలేక… పొలం వద్ద పురుగుల మందు డబ్బాలు చేతిలో పట్టుకొని తమకు న్యాయం చేయాలని నిరసన వ్యక్తం చేశారు రైతులు. 20 ఏళ్లుగా తమ పొలం కబ్జాలో ఉందని.. దాన్ని విడిపించేందుకు 2 లక్షలు లంచం ఇవ్వాలని సర్వేయర్ వేధిస్తున్నాడని రైతులు చెబుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు.