శ్రీరామ నవమి : శోభాయాత్రపై నిఘా కన్ను

ఆలయాల్లో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. శ్రీరామ నవమి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. నగరంలోని చారిత్రక సీతారాం మహరాజ్ సంస్థాన్ ఆధ్వర్యంలో ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. సీతారాంబాగ్ రామాలయంలో ఏప్రిల్ 14వ తేదీ ఆదివారం సీతారాముల కళ్యాణం నిర్వహించేందుకు ఆలయ కమిటీ, అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా శోభాయాత్ర నిర్వహించనున్నారు.
యాత్ర సందర్భంగా నగర పోలీసు విభాగం ప్రత్యేక చర్యలు తీసుకొంటోంది. బషీర్‌బాగ్‌లోని నగర పోలీసు కమిషనరేట్ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా భద్రతను పర్యవేక్షిస్తున్నారు. 3 వేల మంది పోలీసులు బందోబస్తులో పాల్గొంటున్నారు. ఉదయం 10గంటలకు శోభాయాత్ర స్టార్ట్ కానుంది. గంగాబౌలి, సీతారాంబాగ్ ఆలయాల నుండి యాత్ర ప్రారంభం కానుంది. బోయిగూడ కమాన్, మంగల్‌హాట్ పీఎస్, జాలీ హనుమాన్, ధూల్‌పేట, పురానాపూల్, గాంధీ విగ్రహం, జుమ్మైరాత్ బజార్, చుడీబజార్, బేగంబజార్, బర్తన్ బజార్, సిద్దంబర్ బజార్, శంకర్ షేర్ హోటల్, గౌలీగుడా చమన్, గురుద్వారా, పుత్లీబౌలీ క్రాస్‌రోడ్డు, కోఠి, సుల్తాన్‌బజార్ మీదుగా హనుమాన్ వ్యాయంశాల వరకు కొనసాగనుంది.
శోభాయాత్ర సుల్తాన్ బజార్‌లోని హనుమాన్ వ్యాయామశాల వరకు దాదాపు 7.5 కిలోమీటర్ల మేర జరుగనుంది. యాత్రలో ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలపై నగర ట్రాఫిక్ అదనపు పోలీసు కమిషనర్ అనీల్ కుమార్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. నగర ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. శోభాయాత్ర ప్రశాంతంగా, సజావుగా జరిగేందుకు వీలుగా నగర పోలీసులు, జీహెచ్‌ఎంసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. వివిధ ప్రాంతాలను నగర పోలీసు కమిషనర్ అంజనీ కుమార్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ దాన కిషోర్ పరిశీలించారు. శోభాయాత్ర కొనసాగే రూట్‌లో 192 ప్రత్యేక సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు.