సినిమా సీన్ కాదు: గంటలో మూడు ఫోన్లు చోరీ చేసిన హైదరాబాదీ

సినిమా సీన్ కాదు: గంటలో మూడు ఫోన్లు చోరీ చేసిన హైదరాబాదీ

Updated On : August 27, 2019 / 2:47 AM IST

ఒకే రోజు గంట వ్యవధిలో 3 పోలీస్ స్టేషన్ల పరిధిలో సెల్ ఫోన్ల చోరీకి పాల్పడిన నిందితుడిని సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. అడిషినల్ డీసీపీ ఎస్. చైతన్యకుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆజంపూరకు చెందిన మహ్మద్ మోసిన ఏడో తరగతితో చదువుకు స్వస్తి చెప్పాడు. జీవనోపాధి కోసం గతంలో కోఠిలో పండ్ల వ్యాపారం చేసేవాడు. 

అదుపు చేసే వాళ్లు లేకపోవడంతో చెడు స్నేహాలకు దగ్గరై దురలవాట్లకు బానిసయ్యాడు. 2016లో అతడికి భవానీనగర్ రౌడీషీటర్ మహ్మద్ మాజిద్‌తో గొడవ జరిగింది. ఈ ఘటనలో మోసిన్ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ పరిణామంతో కంగుతిన్న అతడి కుటుంబసభ్యులు అతడిని ఖతర్‌కు పంపారు. 
ఇటీవల నగరానికి తిరిగివచ్చిన మోసిన మళ్లీ ఖతర్ వెళ్లకుండా పాత పంథాను అనుసరించాడు. రాత్రంతా స్నేహితులతో కలిసి తిరుగుతూ జల్సాలు చేసేవాడు. ఖర్చులు పెరిగిపోవడంతో తక్కువ కాలంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలని భావించాడు. శుక్రవారం సాయంత్రం తన స్నేహితుడి బైక్ తీసుకుని రాత్రంతా రోడ్లపై తిరిగాడు.

శనివారం తెల్లవారుజామున మలక్ పేట్, చాదర్ ఘాట్, అఫ్టల్ గంజ్ పోలీస్ స్టేషన్ల పరిధిలో వరుసపెట్టి నేరాలకు పాల్పడ్డాడు. ఒంటరిగా సెల్ ఫోన్ మాట్లాడుతూ నడిచి వెళుతున్న వారిని టార్గెట్‌గా చేసుకుని కేవలం గంట వ్యవధిలో 3 స్నాచింగ్స్‌కు పాల్పడ్డాడు. దీనిపై ఆయా స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. 

నేరస్థుడిని పట్టుకోవడానికి దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ కె. మధుమోహన్ రెడ్డి నేతృత్వంలో ఘటనాస్థలాల్లో ఉన్న సీసీ కెమెరాల రికార్డును పరిశీలించారు. సౌత్ జోన్ టాస్క్‌ఫోర్స్ మోసిన్‌ను గుర్తించారు. సోమవారం తదుపరి చర్యల నిమిత్తం చోరీ సొత్తుతో సహా నిందితుడిని మలక్‌పేట పోలీసులకు అప్పగించారు.