కరీంనగర్ నుంచి సీఎం కేసీఆర్ ప్రచారం

  • Published By: veegamteam ,Published On : March 12, 2019 / 11:25 AM IST
కరీంనగర్ నుంచి సీఎం కేసీఆర్ ప్రచారం

హైదరాబాద్ : ఏ ఎన్నికల ప్రచారాన్ని అయినా ముఖ్యమంత్రి కేసీఆర్ కరీంనగర్ నుంచే ప్రారంభిస్తారు. అయితే లోక్ సభ ఎన్నికల ప్రచారానికి కూడా మరోసారి కరీంనగర్ నే ఎంచుకున్నారు. ఈ సారి కూడా అక్కడి నుంచే ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెట్టనున్నారు. కరీంనగర్ లో మార్చి 17న నిర్వహించే బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగించి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. ఆ తర్వాత మార్చి 19న నిజామాబాద్ లో మరొక బహిరంగ సభను నిర్వహించనున్నారు. ఈ మేరకు హైదరాబాద్ లో కేసీఆర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో సమావేశం అయ్యారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలతోపాటు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ పార్టీ ఎంపీ అభ్యర్థుల గెలుపు బాధ్యతను ప్రతి ఎమ్మెల్యే భుజస్కందాలపై వేసుకోవాలన్నారు. 17 లోక్ సభ నియోజకవర్గాలకు గానూ 16 నియోజకవర్గాల్లో ఎక్కువ సంఖ్యలో సభలను నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు. ప్రతి సభలోనూ కేసీఆర్ ప్రసంగించనున్నారు. ప్రతొక్క సభకు రెండు లక్షల మంది హాజరవుతారని అంచనా.

గత సంవత్సరం కరీంనగర్ నుంచి రైతు బంధు పథకాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ’సింహ గర్జన’ పేరుతో నిర్వహించిన మొదటి బహిరంగ సభ కూడా 2001లో కరీంనగర్ లోనే జరిపారు. కరీంనగర్ ఎంపీ స్థానం నుంచి కేసీఆర్ వరుసగా మూడు సార్లు విజయం సాధించి హ్యాట్రిక్ నమోదు చేశారు. 2004 లో గెలుపొందిన తర్వాత 2006, 2008 లో జరిగిన ఉప ఎన్నికల్లో కేసీఆర్ విజయం సాధించారు.