ఆర్టీసీ ఉద్యోగులకు సీఎం వార్నింగ్ : విధుల్లో చేరకపోతే ఉద్యోగం ఊడుతుంది
ఆర్టీసీ కార్మికుల సమ్మెపై కఠినంగా వ్యవహరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం అధ్యక్షతన నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

ఆర్టీసీ కార్మికుల సమ్మెపై కఠినంగా వ్యవహరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం అధ్యక్షతన నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
ఆర్టీసీ కార్మికుల సమ్మెపై కఠినంగా వ్యవహరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం అధ్యక్షతన నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఆర్టీసీ కార్మికులతో జరిపిన చర్చల సారాంశాన్ని సీనియర్ ఐఏఎస్ అధికారుల కమిటీ సీఎంకు వివరించింది. సమ్మె నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లను కూడా అధికారులు సీఎంకు వివరించారు.
తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె వ్యవహారంపై సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రగతిభవన్‌లో త్రిసభ్య కమిటీతో సమీక్ష నిర్వహించారు. ఆర్టీసీ సమ్మెపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ కార్మిక సంఘాలతో ఇక చర్చలు జరిపే ప్రసక్తే లేదని, వారు మొండిగా సమ్మెకు వెళ్తున్న నేపథ్యంలో కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది. ఇదే సందర్భంలో ఆర్టీసీలో ఉన్న కార్మికులు, ఉద్యోగులందరికీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున విజ్ఞప్తి కూడా చేసింది.
ఆర్టీసీ కార్మికులు శనివారం(అక్టోబర్ 5,2109) సాయంత్రంలోగా విధుల్లో చేరాలని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ఆదేశించారు. సాయంత్రం 6 గంటల లోపు విధుల్లో చేరని కార్మికులు ఉద్యోగం కోల్పోవాల్సి వస్తోందని హెచ్చరించారు. ఇక నుంచి ఆర్టీసీ కార్మిక సంఘాలతో ఎలాంటి సంప్రదింపులు, చర్చలు జరుపబోమని స్పష్టం చేశారు. ఆర్టీసీ సమ్మెపై ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీని రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. ఆర్టీసీ సమ్మెపై కార్మిక సంఘాలతో జరిగిన చర్చల్లో మంత్రి పాల్గొన్నారు. సమ్మెపై నిషేధం కొనసాగుతున్న సమయంలో … కార్మికుల సమ్మె చేయడం చట్ట విరుద్ధమన్నారు. పండుగ సమయంలో ఆదాయం పెంచుకోవాల్సిందిబోయి… బ్లాక్ మెయిల్ విధానాలను అవలంభించడం సరికాదన్నారు. డ్యూటీకి వచ్చే వారికి పూర్తి రక్షణను ప్రభుత్వం ఇస్తుందని తెలిపారు. కార్మిక సంఘాల నాయకుల ఉచ్చులో కార్మికులు పడొద్దని సూచించారు. అమాయకమైన ఉద్యోగులను యూనియన్ నేతలు మోసగించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. అంతకుముందు ఆర్టీసీ కార్మిక సంఘాలతో చర్చల సారాంశాన్ని సీఎం కేసీఆర్‌కు వివరించారు.
ఆర్టీసీ కార్మిక సంఘాలు సమ్మె విరమించాలని ఆర్టీసీ ఇంచార్జ్ ఎండీ సునీల్ శర్మ కోరారు. లేకుంటే డ్రైవర్, కండక్టర్‌లను తాత్కాలిక పద్ధతిలో తీసుకుంటామని అన్నారు. ఇప్పటికే నోటిఫికేషన్‌కు స్పందించి 3 వేల దరఖాస్తులు వచ్చాయన్నారు. 70 శాతం ప్రత్యామ్నాయ మార్గాలు పూర్తయ్యాయని తెలిపారు. ప్రతి డిపోకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామన్నారు. విధుల్లో పాల్గొనే వారికి రక్షణ కల్పిస్తామన్నారు. ప్రైవేట్ వాహనాలు, పక్క రాష్ట్రంలోని బస్సులను సమకూర్చుతామని చెప్పారు. హైదరాబాద్ లో మెట్రో సేవలను పెంచుతామన్నారు. తమిళనాడు నుంచి కూడా బస్సులను రప్పిస్తున్నామని చెప్పారు. అలాగే మెట్రో, ఉబెర్, ఓలా కంపెనీలకు ఎక్కువ ఛార్జ్ చేయొద్దని చెప్పినట్లు తెలిపారు. నగరంలో మెట్రో సర్వీసులను కూడా పెంచుతామన్నారు సునీల్ శర్మ.
ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంది. అవసరమైతే పోలీస్ బందోబస్తు మధ్య సర్వీసులను నడపాలని నిర్ణయించింది. రాష్ట్రంలోని అన్ని ఆర్టీసీ డిపోల దగ్గర 144 సెక్షన్ అమల్లో ఉంటుందని చెప్పారు డీజీపీ మహేందర్‌రెడ్డి. ప్రతీ డిపోకి ఒక పోలీస్ అధికారిని ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రజలకు అసౌకర్యం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.