బాబోయ్ మెట్రో : ఆందోళనలో ప్రయాణికులు

బాబోయ్ మెట్రో అంటున్నారు నగర వాసులు. అమీర్ పేట మెట్రో స్టేషన్‌లో పెచ్చులూడి ఓ యువతి ప్రాణాలు కోల్పోవడంతో ప్యాసింజర్లు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఎక్కడ ఏమి జరుగుతుందోనన్న టెన్షన్ వారిలో నెలకొంది. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ప్రయాణం చేయాల్సి వస్తోందని అంటున్నారు జనాలు. గతంలోనూ ఫాల్ సీలింగ్ ఎగరిపడడమే ఇందుకు కారణం. స్టేషన్లలోని సీలింగ్, పిల్లర్లు పెచ్చులూడుతుండడంపై నగర ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. స్టేషన్లు ప్రారంభమైన రెండేళ్లకే ఇలా కావడం..నిర్మాణ పనుల్లోని డొల్లతనాన్ని స్పష్టం చేస్తోంది.
పబ్లిక్ – ప్రైవేటు భాగస్వామ్యంతో ప్రపంచంలోనే అతి పెద్ద ప్రాజెక్టు అని ప్రభుత్వం చెబుతూ వస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే మెట్రోపై అసెంబ్లీలో మంత్రి కేటీఆర్ పలు వ్యాఖ్యలు కూడా చేశారు. ఇతర నగరాల్లో కంటే హైదరాబాద్ మెట్రో బెటర్ అన్నారు. కానీ ఇలాంటి సంఘటన జరగడం దారుణమంటున్నారు. నగర పరిధిలోని ఎల్బీనగర్, మియాపూర్, నాగోల్, హైటెక్ సిటీ మార్గాలో మెట్రో రైళ్లు రాకపోకలు సాగిస్తున్న విషయం తెలిసిందే. ప్రీ కాస్ట్ విధానంలో సిద్ధం చేసిన విడిభాగాలతో మెట్రో స్టేషన్లు రూపుదిద్దుకున్నాయి.
మూడు అంతస్తులుగా పిలిచే ఒక్కో మెట్రో స్టేషన్ నిర్మాణానికి సుమారు రూ. 50 కోట్ల నుంచి రూ. 100 కోట్ల వరకు ఖర్చు చేశారు. రహదారి మార్గంలో ఉండే మెట్రో మార్గానికి పై కప్పులను కాంక్రీటు మిశ్రమం, టైల్స్, ఫాల్ సీలింగ్ ఇతర, ఫినిషింగ్ మెటీరియల్‌తో తీర్చిదిద్దారు. పై కప్పులకు అతికించిన టైల్స్, పిల్లర్లు, సెగ్మెంట్ల మధ్యనున్న ఖాళీ ప్రదేశాలను పూడ్చిన కాంక్రీటు మిశ్రమం రైళ్ల రాకపోకలు సాగించేటప్పుడు, భారీ వర్షాలు కురిసిన సమయంలో ఊడిపడుతుండడంతో తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. నగరంలోని మూడు మార్గాల్లో ఉన్న 64 స్టేషన్లలో ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు.