అంతా మీ వల్లే : టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ పై వీహెచ్ ఆగ్రహం

  • Published By: chvmurthy ,Published On : May 11, 2019 / 07:24 AM IST
అంతా మీ వల్లే : టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ పై వీహెచ్ ఆగ్రహం

Updated On : May 11, 2019 / 7:24 AM IST

హైదరాబాద్ : స్ధానిక సంస్ధల కోటాలో జరిగే ఉప ఎన్నికల్లో అభ్యర్ధులను ఖరారు చేసేందుకు శనివారం సమావేశం అయిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ  సమావేశం వాడి వేడిగా సాగింది. టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు గాంధీభవన్ లో  సమావేశం అయ్యారు. ఈసమావేశానికి ఏఐసీసీ ఇంచార్జ్  ఆర్.సి కుంతియా, పలువురు సీనియర్ నేతలు,  కార్యనిర్వాహక అధ్యక్షులు, మాజీ పీసీసీ అధ్యక్షులు, మాజీ కేంద్ర మంత్రులు, మాజీ ఉప ముఖ్యమంత్రి, మాజీ మంత్రులు హజరయ్యారు. ఎమ్యెల్సీ ఎన్నికలు జరుగుతున్న రంగారెడ్డి, వరంగల్, నల్గోండ డీసీసీ అధ్యక్షులు హజరయ్యారు. ఈ ఎన్నికల్లో ఎవర్నినిలబెట్టాలి, వారు పోటీలో నిలబడతారా, లేక అధికార పార్టీ  ప్రలోభాలకు లొంగి తమ నామినేషన్ విత్ డ్రా చేసుకుంటారా అనే అంశాలను కూడా వారు చర్చిస్తున్నారు. ఇంతలో పార్టీ సీనియర్ నేత వీ.హనుమంతరావు పీసీసీ చీఫ్  ఉత్తమ్ కుమార్, ఇంచార్జ్ కుంతియాల పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ  పార్టీలో జరుగుతున్న పరిస్ధితులపై ఆక్రోశం వెళ్లగక్కారు.  
 
పార్టీలో జరుగుతున్న పరిస్ధితులన్నీ చాలా దరదృష్టకరంగా ఉన్నాయని,  చాలామంది పార్టీ మారటానికి మీ నాయకత్వ లోపమే కారణమని వీహెచ్  ఆరోపించారు. మీ వ్యవహార శైలి మార్చుకోవాలని ఆయన ఉత్తమ్ కు  సూచించారు. అంతా అయిపోయాక సమావేశాలు పెట్టడం వల్ల ఏమీ ప్రయోజనం ఉండదని వీహెచ్  హితవు పలికారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఒక్కడే తిరగడమేంటి? ….  సీనియర్ నాయకులను కలుపుకుని వెళ్లాల్సిన అవసరం లేదా? అని ప్రశ్నించారు.

కొత్త వారికి ప్రాధాన్యత ఇచ్చి పాత వారిని విస్మరిస్తున్నారని వీహెచ్ ధ్వజమెత్తారు. ఇది కూడా చాలామంది పార్టీ మారటానికి కారణమని ఆయన అన్నారు. పార్టీలో బీసీలకు అన్యాయం జరుగుతోందని మండి పడ్డారు. పదవులు ఉన్నవారికే తిరిగి పదవులు ఇవ్వటం వలన కూడా పార్టీ ప్రతిష్ట దిగజారుతోందని  వీహెచ్ అన్నారు. నిజామాబాద్ లో ఆకుల లలిత కి ఎమ్మెల్సీ ఉండగానే.. మళ్ళీ ఎమ్మెల్యే గా  అవకాశం ఇచ్చారు.. అయిన ఆమె పార్టీ మారిపోయిందని, కాసాని జ్ఞానేశ్వర్, ఆర్ కృష్ణయ్య కి ఏ  ప్రాతిపదికన టిక్కెట్లు ఇచ్చారని ఆయన ప్రశ్నించారు.  నాంపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి గా పోటీ చేసిన ఫెరోజ్ ఖాన్ కి హైదరాబాద్ ఎంపి అభ్యర్ధిగా ఎలా పెట్టారని అడిగారు. పార్టీలో జరుగుతున్న పలు పరిణామాలపై  ఆవేశంగా మాట్లాడిన అనంతరం ఆయన ఇందిరా పార్క్ వద్ద జరుగుతున్న అఖిల పక్ష ధర్నాలో పాల్గోనేందుకు వెళ్లి పోయారు.