తెలుగు రాష్ట్రాల్లో కరోనా కలవరం
ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్... భారత్‌లోను కలకలం సృష్టిస్తోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలను ఎక్కువగా టెన్షన్ పెడుతోంది. హైదరాబాద్‌లోనూ కరోనా లక్షణాలతో పలువురు ఆస్పత్రుల్లో చేరడంతో ఆందోళన మొదలైంది.

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్… భారత్‌లోను కలకలం సృష్టిస్తోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలను ఎక్కువగా టెన్షన్ పెడుతోంది. హైదరాబాద్‌లోనూ కరోనా లక్షణాలతో పలువురు ఆస్పత్రుల్లో చేరడంతో ఆందోళన మొదలైంది.
ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్… భారత్‌లోను కలకలం సృష్టిస్తోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలను ఎక్కువగా టెన్షన్ పెడుతోంది. ఓవైపు ఢిల్లీలో ఇవాళ మూడు కేసులు నమోదవగా… హైదరాబాద్‌లోనూ కరోనా లక్షణాలతో పలువురు ఆస్పత్రుల్లో చేరడంతో ఆందోళన మొదలైంది. అయితే… ఇప్పటివరకు ఏ ఒక్కరు కూడా ఆ వైరస్ బారినపడినట్లు నిర్ధారణ కాలేదు. అటు… ప్రభుత్వాలు కూడా అలర్టయ్యాయి. కరోనాను కట్టడి చేసేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాయి. హైదరాబాద్ కొన్ని ఆస్పత్రుల్లో ప్రత్యేక వార్డులు ఏర్పాటుచేయగా… ఎయిర్‌పోర్టుల్లో ప్రయాణికులకు స్క్రీనింగ్ టెస్టులు నిర్వహిస్తున్నారు.
ఫ్లూ లక్షణాల మాదిరిగానే కరోనా వైరస్ లక్షణాలు
కరోనా వైరస్ లక్షణాలు… సాధారణ ఫ్లూ లక్షణాల మాదిరిగానే ఉండటంతో చైనా, హాంకాంగ్, ఈశాన్య దేశాల నుంచి వచ్చిన ప్రయాణికులు భయాందోళనలకు గురవుతున్నారు. జలుబు, దగ్గు, జ్వరం లక్షణాలు కనిపించగానే ఆస్పత్రులకు పరుగులు పెడుతున్నారు. కరోనా అనుమానాలతో ఇప్పటివరకు 8మంది హైదరాబాద్‌లోని ఫీవర్ ఆస్పత్రిలో చేరారు. వారిలో ముగ్గురికి కరోనా వైరస్ లేదని తేల్చగా… నిన్న మరో ఐదుగురు ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. ఇందులో ఒకే కుటుంబానికి చెందిన దంపతులు, ఒక చిన్నారి ఉన్నారు. ఇవాళ వీరి నమూనాలను సేకరించి పుణెలోని వైరాలజీ ప్రయోగశాలకు పంపించడానికి వైద్యఆరోగ్యశాఖ ఏర్పాట్లు చేసింది.
హైదరాబాద్‌లో వంద పడకలతో ప్రత్యేక వార్డులు
కరోనా వైరస్‌పై అలర్టయిన ప్రభుత్వం…. అనుమానితులను తరలించడానికి శంషాబాద్ విమానాశ్రయం, గాంధీ, ఫీవర్, ఛాతీ ఆసుపత్రుల్లో నాలుగు అంబులెన్సులను సిద్ధం చేసింది. ఫీవర్ హాస్పిటల్, గాంధీ, చెస్ట్ ఆస్పత్రుల్లో ప్రత్యేక వార్డులు ఏర్పాటుచేసింది. మరోవైపు…. చైనా నుంచి వచ్చే ప్రయాణికులు ధైర్యంగా హాస్పిటల్‌కు రావొచ్చన్నారు ఫీవర్ హాస్పిటల్ సూపరింటెండెంట్ శంకర్. హైదరాబాద్‌లో వంద పడకలతో ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేశామని చెప్పారు.
హైదరాబాద్‌లో కేంద్ర బృందం పర్యటన
కరోనా కల్లోలంతో ఢిల్లీ నుంచి వచ్చిన కేంద్ర బృందం… హైదరాబాద్‌లో విస్తృతంగా పర్యటిస్తోంది. నిన్న శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లిన ముగ్గురు సభ్యుల కేంద్ర బృందం.. అక్కడ థర్మల్ స్కానింగ్, ఇతర పరీక్షలును పరిశీలించింది. అనంతరం ఫీవర్ ఆసుపత్రిలోనూ అనుమానితుల వార్డును, వైరాలజీ ల్యాబ్‌ను సందర్శించింది. అక్కడ వైద్య పరీక్షలు పొందుతున్న వారి వివరాలను తెలుసుకుంది. ప్రత్యేక శిక్షణ ఉన్న సిబ్బందిని ఈ వార్డులో నియమించాలని అధికారులకు సూచించింది. అయితే… ఫీవర్ ఆస్పత్రిలో వెంటిలేషన్ సిస్టమ్ లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తంచేసిన బృందం… ఇవాళ గాంధీ ఆసుపత్రిని సందర్శించనుంది. ఇక్కడ పరిశీలించిన అంశాలు, కావాల్సిన సౌకర్యాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నివేదిక ఇవ్వనుంది. కరోనా అనుమానితులకు చికిత్స అందించేందుకు మరింతమంది వైద్య బృందం కావాల్సి ఉందని ఏపీ, తెలంగాణ రీజినల్ డైరెక్టర్ అనురాధ అన్నారు. కరోనా వైరస్ స్క్రీనింగ్ కోసం టెక్నాలజీతో పాటు మెషినరీ కూడా తెప్పించాల్సి ఉందన్నారు. ఫీవర్ ఆస్పత్రిలో ఇప్పుడున్న వసతులతో పాటు మరిన్ని ఏర్పాట్లు సూచించామన్నారు.
దేశవ్యాప్తంగా అప్రమత్తత ప్రకటించిన కేంద్రం
మరోవైపు… కరోనా వైరస్‌పై దేశవ్యాప్తంగా అప్రమత్తత ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్రాల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తోంది. ఇవాళ మరోసారి అన్ని రాష్ట్రాల వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశాన్ని నిర్వహించనుంది. రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ కూడా ఇవాళ ఉన్నతాధికారులతో సమీక్ష జరపనున్నారు. కరోనా వైరస్ ఖండంతారాలు దాటి వేగంగా విస్తురిస్తుండటంతో.. అటు ఏపీ వైద్యారోగ్యశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. దేశ, విదేశాల నుంచి విశాఖకు వచ్చే పర్యాటకులకు వైరస్‌పై అవగాహన కలిగించే చర్యలను చేపట్టారు. ఎయిర్‌పోర్టు ఆవరణలో వైరస్ పట్ల అవగాహన కలిగించేలా ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. విదేశాల నుండి వచ్చే ప్రయాణికులకు స్క్రీనింగ్ టెస్టులు చేస్తున్నారు.
కేజీహెచ్‌లో ప్రత్యేక వార్డు
కరోనా అనుమానితుల కోసం కేజీహెచ్‌లో మూడు పడకలతో ప్రత్యేక వార్డును సిద్ధం చేశారు. విమానాశ్రయంలో అంతర్జాతీయ ప్రయాణికులకు ప్రభుత్వ వైద్యులతో ఆరోగ్య పరీక్షలు చేస్తున్నారు. ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా అప్రమత్తం చేసిన నేపథ్యంలో విశాఖ విమానాశ్రయంలోని అరైవల్స్ విభాగంలో ప్రత్యేక శిబిరాన్ని తెరిచారు. ప్రత్యేకించి దుబాయ్, కౌలాలంపూర్, సింగపూర్ నుంచి వస్తున్న ప్రయాణికులను పూర్తిస్థాయిలో పరీక్షించాకే నగరంలోకి అనుమతిస్తున్నారు.
తిరుపతిలో వైద్యాధికారులు అలర్ట్
ఎవరిలోనైనా కరోనా వైరస్ లక్షణాలున్నట్లు, ఇతర అనారోగ్యపరిస్థితులు కనిపిస్తే.. వెంటనే కేజీహెచ్ తరలించేందుకు అంబులెన్స్‌ను కూడా అందుబాటులో ఉంచారు. కరోనా వైరస్ నిర్థారణకు అవసరమైన పరీక్షలు చేసి పూణె పంపేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటివరకు ఎవరిలోనూ కరోనా వైరస్ లక్షణాలు బయటపడకపోయినా అప్రమత్తంగా ఉన్నామని జిల్లా ఆరోగ్యశాఖ అధికారి తిరుపతి రావు తెలిపారు. మరోవైపు భక్తులు ఎక్కువగా వచ్చే తిరుపతిలోను వైద్యాధికారులు అలర్టయ్యారు. కరోనా వైరస్‌పై అప్రమత్తంగా ఉండాలన్న కేంద్రం ఆదేశాలతో… రుయా ఆసుపత్రి వైద్యాధికారులు అప్రమత్తమయ్యారు. ఆస్పత్రిలో ఎనిమిది పడకలతో ప్రత్యేక కరోనా వైరస్ వార్డును ఏర్పాటు చేశారు.