పంచాయతీ ఎన్నికలు : మంత్రివర్గ విస్తరణకి బ్రేక్

- తెలంగాణ కేబినెట్ విస్తరణకు కొత్త ‘పంచాయతీ’.
- పంచాయతీ ఎన్నికల కోడ్ అమల్లోకి.
- ఆశావాహుల ఎదురుచూపులు మరికొన్ని రోజులు.
- అసెంబ్లీ నిర్వహించాలంటే అనుమతి తప్పనిసరి.
హైదరాబాద్ : తెలంగాణలో మంత్రివర్గ విస్తరణకు కొత్త ‘పంచాయతీ’ వచ్చి పడింది. పంచాయతీ ఎన్నికలు కేబినెట్ విస్తరణపై పడింది. ఎన్నికలు ముగిసేదాక మంత్రివర్గ విస్తరణ చేపట్టే అవకాశాలు కనిపించడం లేదు. మరికొన్ని రోజులు ఆశావాహులు వేచి చూసే పరిస్థితి ఏర్పడింది.
ప్రభుత్వం ఏర్పడి పక్షం రోజులు…
తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రెండోసారి వచ్చిన టీఆర్ఎస్..ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు కావస్తోంది. మంత్రివర్గ విస్తరణకు గులాబీ దళపతి పూనుకోలేదు. అదిగో…ఇదిగో అంటూ వార్తలు వస్తున్నాయి. కొద్ది రోజుల్లోనే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని కేసీఆర్ చెప్పినా అది ఇంతవరకు ఆచరణకు పూనుకోలేదు.
హోం మంత్రిగా మహమూద్ ఆలీ…
రెండోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్…హోం మంత్రిగా మహమూద్ ఆలీ ప్రమాణ స్వీకారాలు చేశారు. తరువాత మంత్రివర్గ విస్తరణ ఉంటుందని ప్రచారం జరిగింది. తమకు మంత్రి పదవులు దక్కాలని పలువురు లాబీయింగ్ జరిపారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వద్దకు ఆశావాహులు క్యూ కట్టారు. అన్నా మమ్మల్ని గుర్తు పెట్టుకోండి అంటూ వేడుకుంటున్నారు.
విస్తరణపై పుకార్లు…
అసెంబ్లీ సమావేశాలకు ముందుగా కేబినెట్ విస్తరణ ఉంటుందని ప్రచారం జరిగినా..అదీ కాలేదు. సంక్రాంతి తరువాత విస్తరణ ఉంటుందని మరో ప్రచారం జరిగింది. ఈ సమయంలో అందరి గుండెల్లో పిడుగులాంటి వార్త వచ్చి పడింది. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది. కోడ్ కూడా అమల్లోకి వచ్చేసింది. ఈ తరుణంలో మంత్రివర్గ విస్తరణ చేపట్టే అవకాశం లేదని నిపుణులు వెల్లడిస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలంటే తమ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని….ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణ చేపట్టరాదని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.