3డీ మ్యాప్‌తో పోలీసులపై ఎన్‌హెచ్ఆర్సీ ఎంక్వైరీ

3డీ మ్యాప్‌తో పోలీసులపై ఎన్‌హెచ్ఆర్సీ ఎంక్వైరీ

Updated On : December 10, 2019 / 1:50 AM IST

దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ను సుమోటోగా స్వీకరించిన జాతీయ మానవహక్కుల కమిషన్‌ (ఎన్‌హెచ్‌ఆర్సీ) దర్యాప్తు నాలుగో రోజుకు చేరింది. ఈ మేర ఆ సమయంలో నిందితులతో పాటు ఉన్న పోలీసులను మంగళవారం విచారిచంనున్నట్లు సమాచారం. ఘటనలో గాయపడి చికిత్స పొందుతున్న ఎస్సైని, కానిస్టేబుల్‌ను సోమవారం సుదీర్ఘంగా విచారించారు. ఎదురుకాల్పుల్లో ఎస్సై వెంకటేశ్వర్లుతో పాటు కానిస్టేబుల్‌ అరవింద్‌గౌడ్‌ గాయపడ్డారని సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్ వెల్లడించారు. 

కేర్‌ ఆసుపత్రిలో ఉన్న వారిద్దరినీ కమిషన్‌ సభ్యులు సోమవారం సుమారు 3 గంటల పాటు విచారించారు. వారికి ఎటువంటి ట్రీట్‌మెంట్ అందుతుందో అడిగి తెలుసుకున్నారు. మృతదేహాలకు పంచనామా నిర్వహించిన నలుగురు తహసీల్దార్లను కూడా పిలిచి విచారించారు. 

ఎన్‌కౌంటర్‌ ప్రాంతం త్రీడీలో చిత్రీకరణ
చటాన్‌పల్లి కల్వర్టు సమీపంలో జరిగిన పోలీసు కాల్పుల్లో నలుగురు నిందితులు చనిపోయిన ప్రాంతాన్ని సోమవారం త్రీడీలో చిత్రీకరించారు. మామూలు ఫొటోల్లో ఏవైనా వస్తువుల మధ్య దూరం ఎంత ఉందో తెలిసే అవకాశం లేదు. త్రీడీలో ఇలాంటి వాటిని కూడా అంచనా వేయవచ్చు. కల్వర్టు నుంచి నేరస్థలం ఎంత దూరంలో ఉంది. నేరస్థలం ఎంత ఎత్తులో ఉంది. మృతదేహాల మధ్య దూరమెంత ఉంది. 

నిందితుల మృతదేహాలను హైకోర్టు ఆదేశాల మేరకు సోమవారం రాత్రి మహబూబ్‌నగర్‌ నుంచి హైదరాబాద్‌కు తరలించారు. బందోబస్తు మధ్య గాంధీ ఆసుపత్రికి పంపించారు. మహమ్మద్‌ ఆరిఫ్‌, జొల్లు నవీన్‌, జొల్లు శివ, సీహెచ్‌ చెన్నకేశవులు మృతదేహాలను డిసెంబరు 13వ తేదీ (శుక్రవారం) వరకు భద్రపరచాలంటూ సోమవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.