తెలంగాణలో మళ్లీ ఎన్నికలు

తెలంగాణ రాష్ట్రంలో మరోసారి ఎన్నికల నగారా మ్రోగించేందుకు ప్రభుత్వం సిద్ధం అయ్యింది. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ గ్రేటర్ ఎన్నికలు మినహా ఇప్పటివరకు అన్ని ఎన్నికలు ముగిసినట్లే. ఇటీవల జరిగిన కార్పోరేషన్ ఎన్నికలతో దాదాపు ముఖ్యమైన ఎన్నికలు ముగియగా.. రాష్ట్రంలో త్వరలోనే ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు (పీఏసీఎస్) ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది ప్రభుత్వం.
పీఏసీఎస్‌ల ఎన్నికలు వెంటనే నిర్వహించాలని అధికారులను ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం (జనవరి 29) ఆదేశించారు. పర్సన్ ఇన్‌ఛార్జీల పదవీ కాలం ముగుస్తున్నందున ఎన్నికలు నిర్వహించాలని. నాలుగు రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయాలని ఆదేశాలు విడుదల చేశారు. 15 రోజుల్లోగా అంటే ఫిబ్రవరి నెలలో మొత్తం ఎన్నికల ప్రక్రియను ముగించి, పీఎసీలకు కొత్త పాలక మండళ్లు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు.
ఇటీవలి మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. 120 మున్సిపాలిటీల్లో 112, పదింటికి 10 కార్పొరేషన్లను గెలుచుకుంది టీఆర్‌ఎస్ పార్టీ. ఇదే ఊపులో మిగిలిన కోపరేటివ్ సంఘాల ఎన్నికలను పూర్తి చెయ్యాలని గులాబి బాస్ భావిస్తున్నారు. సహకార సంఘాల పాలకవర్గాలకు ఈసారైనా ఎన్నికలు నిర్వహిస్తారా? లేక ఇప్పటికే నియమించిన కమిటీలను పొడిగిస్తారా? అంటూ నాయకులు ఎన్నో రోజులు నుంచి సంధిస్తున్న ప్రశ్నే. ఆ నిరాశకు ఇప్పుడు ఫుల్ స్టాప్ పడనుంది.