బంపర్ ఆఫర్ : నామినేటెడ్ ఎమ్మెల్యేగా స్టీఫెన్‌సన్
హైదరాబాద్: తెలంగాణ తొలి కేబినెట్ సమావేశం సింగిల్ పాయింట్ ఎజెండాతో ముగిసింది. నామినేటెడ్ సభ్యుడిగా ఆంగ్లో ఇండియన్ స్టీఫెన్ సన్‌ను నియమిస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. 2019, జనవరి 17వ తేదీ గురువారం నుంచి జరగనున్న అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై చర్చ జరిగింది. అటు ప్రభుత్వ సంక్షేమ పథకాలకు మార్గదర్శకాలను ఖరారు చేయాలని నిర్ణయించారు.
తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక.. ప్రగతి భవన్‌లో తొలి కేబినెట్ సమావేశం జరిగింది. సీఎం కేసీఆర్, హోంమంత్రి మహమూద్ అలీతో పాటు సీఎస్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలతో పాటు నామినేటెడ్ ఎమ్మెల్యే కూడా ప్రమాణం చేయనున్నారు. అసెంబ్లీ నామినేటెడ్ ఎమ్మెల్యేగా క్రిస్టియన్, ఆంగ్లో ఇండియన్ స్టీఫెన్ సన్‌ను ఎంపిక చేసింది కేబినెట్. సీఎం కేసీఆర్ స్టీఫెన్ సన్‌కు మరో అవకాశం ఇచ్చారు. మరో ఐదేళ్ల పాటు ఆయన ఎమ్మెల్యేగా కొనసాగనున్నారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను గవర్నర్‌కు పంపింది. గవర్నర్ ఆమోదం తెలిపిన వెంటనే గెజిట్ విడుదల అవుతుంది. చట్టసభల్లో ఆంగ్లో ఇండియన్ల ప్రాతినిధ్యం ఉండాలనే రాజ్యాంగ నిబంధన మేరకు తెలంగాణ అసెంబ్లీలో ఈ నియామకానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంది.
అసెంబ్లీ ఎన్నికలను అత్యంత ప్రశాంతంగా నిర్వహించినందుకు భారత ఎన్నికల సంఘాన్ని మంత్రివర్గం అభినందించింది. రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి రజత్ కుమార్2ను, ప్రభుత్వ యంత్రాంగాన్ని కూడా కేబినెట్ ప్రత్యేకంగా అభినందించింది. వీటితో పాటు వివిధ పథకాలకు సంబంధించిన అంశాలపై చర్చించారు. ప్రధానంగా నీటి ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలపై చర్చించారు. అటు అసెంబ్లీ నిర్వహణపై కేబినెట్‌లో చర్చ జరిగింది. అసెంబ్లీకి ఎన్నికైన ఎమ్మెల్యేలకు రాజ్యాంగ ప్రతులను, అసెంబ్లీకి సంబంధించిన వివిధ నిబంధనల పుస్తకాలను, బుక్ లెట్లను, ఇంగ్లీష్, ఉర్ధూ భాషల్లో అందివ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.
స్టీఫెన్ సన్ పేరు వినగానే అందరికి గుర్తుకు వచ్చేది ఓటుకు నోటు కేసు. తెలుగు రాష్ట్రాల్లో స్టీఫెన్ సన్ పేరు ప్రముఖంగా వినిపించింది. స్టీఫెన్ సన్‌ను ప్రలోభపెట్టి పార్టీ మార్పించడం ద్వారా అప్పటి టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి వేం నరేందర్ రెడ్డిని గెలిపించేందుకు రేవంత్‌రెడ్డి ప్రయత్నిండం, రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోడం సంచలనం అయ్యింది. ఆ రకంగా స్టీఫెన్ సన్ అందరికి పరిచయం అయ్యారు.