పొలిటికల్ ఎంట్రీ : బీజేపీ సభ్యత్వం తీసుకోనున్న విద్యా సాగర్ రావు

మహారాష్ట్ర మాజీ గవర్నర్ సీహెచ్ విద్యా సాగర్ రావు మళ్లీ పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నారు. సుదీర్ఘకాలం పాటు బీజేపీలో ఉన్న సంగతి తెలిసిందే. గతంలో ఎంపీగా, కేంద్ర మంత్రిగా పనిచేశారు. 2014లో మహారాష్ట్ర రాష్ట్రానికి గవర్నర్‌గా వెళ్లారు. గత నెలాఖరుతో పదవీకాలం ముగిసింది. సెప్టెంబర్ 16వ తేదీ సోమవారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి రానున్నారు. పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ సమక్షంలో విద్యా సాగర్ రావు బీజేపీ సభ్యత్వం తీసుకుంటారు.
తెలంగాణ రాష్ట్రంపై బీజేపీ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఆ పార్టీ చీఫ్ అమిత్ షా పార్టీ బలోపేతంపై వ్యూహాలు రచిస్తున్నారు. అందులో భాగంగా బలమైన నేతను రంగంలోకి దింపాలని భావించి..గవర్నర్‌గా ఉన్న విద్యా సాగర్ రావు పదవీకాలాన్ని పొడిగించలేదనే ప్రచారం జరిగింది. పార్టీకి చెందిన సీనియర్ లీడర్స్ సేవలను ఉపయోగించుకోవాలని పార్టీ భావిస్తోంది. అందులో భాగంగా విద్యా సాగర్ రావుని తెలంగాణ రాజకీయాల్లో దింపాలని భావిస్తోంది. ముందస్తు ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయదుందుభి మ్రోగించింది. అయితే..టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీ అంటూ ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కమలం జెండా ఎగురుతుందనే ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఇక విద్య సాగర్ రావు విషయానికి వస్తే… 1980లో రాజకీయ ప్రస్థానం మొదలైంది. 1980లో బీజేపీ తరపున కరీంనగర్ లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి పరాజయం పొందారు. 1985లో మెట్ పల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1989, 1994లో రెండుసార్లు గెలుపొంది హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గుర్తింపు పొందారు. 1998లో కరీంనగర్ లోక్ సభ నియోజకవర్గ నుంచి పోటీ చేసి ఎంపీగా గెలుపొంది పార్లమెంట్‌లో అడుగు పెట్టారు. 1999లో మరోసారి గెలుపొంది వాజ్ పేయి ప్రభుత్వంలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. 2004, 2006లో జరిగిన ఉప ఎన్నికల్లో పోటీ చేసి పరాజయం పొందారు. 2009లో వేములవాడ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. తెలంగాణ రాజకీయాలకు దూరమైన విద్యా సాగర్ రావు..తర్వాతి కాలంలో మహారాష్ట్ర గవర్నర్‌గా నియమితులయ్యారు.