గాంధీ ఆస్పత్రిలో కోలుకున్న కరోనా తొలి బాధితుడు

సికింధ్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తొలి కరోనా బాధితుడు కోలుకున్నాడు. కొన్నిరోజుల చికిత్స అనంతరం అతనికి పరీక్షలు నిర్వహించగా నెగెటివ్ వచ్చింది. మరోసారి నిర్ధారణ కోసం బ్లడ్ శ్యాంపిల్స్ పూణేలోని వైరాలజీ ల్యాబ్ కు పంపించనున్నారు. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అయిన ఈ యువకుడు దుబాయ్ వెళ్లి వచ్చి కరోనా బారినపడ్డాడు.(శ్రీలంక బౌద్ధ తీర్థయాత్రికులకు భారత్‌కు నో ఎంట్రీ)
అనంతరం సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నాడు. మెరుగైన చికిత్స, వైద్యుల నిరంతర పర్యవేక్షణతో క్రమంగా యువకుడి ఆరోగ్యం కుదుటపడింది. తొలి మూడు రోజులు ఎలా ఉంటుందో? ఏమౌతుందోనని ఆందోళన చెందిన వైద్యులు ఇప్పుడిక ఇబ్బంది లేదని నిర్ధారణకు వచ్చారు.
ఈ క్రమంలో బాధితుడి జ్వరం తగ్గి, బీపీ అదుపులోకి వచ్చింది. తాజాగా న్యూమోనియా తగ్గుముఖం పట్టడంతో నమూనాలు తీసి గాంధీ మెడికల్ కాలేజీలోని వైరాలజీ ల్యాబ్‌కు పంపారు. నెగెటివ్ అని తేలడంతో ఆసుపత్రి వర్గాల్లో ఉత్సాహం వచ్చింది. 48 గంటల అనంతరం నమూనాలు సేకరించి పుణె వైరాలజీ ల్యాబ్‌కు పంపుతారు. అక్కడినుంచి నివేదిక నెగెటివ్ అని వస్తే సాధ్యమైనంత త్వరగా డిశ్చార్జి చేసే అవకాశముంది. ఇంటికి పంపినా 14 రోజులు ఐసోలేషన్ జాగ్రత్తలు పాటించాలని సూచించనున్నారు.
మరోవైపు…కరోనాపై ప్రజల్లో అవగాహన కోసం తెలంగాణ సర్కార్ చర్యలు ముమ్మరం చేసింది. ఇప్పటికే రాజధాని నగరంలో వివిధ కూడళ్లలో భారీ హోర్డింగ్స్ ఏర్పాటు చేసింది. బస్సు, రైల్వే, మెట్రోస్టేషన్లలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది. అంతేకాదు.. దేశ వ్యాప్తంగా ఎక్కడి నుంచి కాల్ చేసినా.. కాలర్ ట్యూన్‌గా కరోనా జాగ్రత్తలు వినిపిస్తున్నాయి.
తెలంగాణలో నమోదైన పాజిటివ్ కేసులో కూడా రోగి ప్రస్తుతం కోలుకుని నెగెటివ్ వచ్చింది. కరోనా అనుమానితులైన వందలాది మందికి పరీక్షలు నిర్వహించారు. అయినా జనాల్లో మాత్రం కరోనా భయం వీడటం లేదు. దీంతో కరోనాపై విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా హైదరాబాద్‌లోని ప్రధాన కూడళ్లలో కరోనాపై హోర్డింగ్స్‌ను ఏర్పాటు చేసింది జీహెచ్‌ఎంసీ. బస్సు స్టేషన్స్, మెట్రో, రైల్వే స్టేషన్లలోనూ కరోనా జాగ్రత్తలు తెలియజేస్తూ ప్రచారం నిర్వహిస్తోంది.
కేవలం హోర్డింగ్స్‌కే ప్రభుత్వం పరిమితం కాలేదు. కరపత్రాల పంపిణీ మొదలుపెట్టింది. హెల్త్ వర్కర్స్ కరోనాపై కరపత్రాలు పంచుతూ ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. సోషల్ మీడియాలోనూ ప్రభుత్వం అవగాహన కల్పిస్తోంది. వీడియోలు, పోస్టర్లు, వాట్సాప్ మెసేజ్‌లను విడుదల చేసింది.
మరోవైపు సెలబ్రిటీలు సైతం ప్రజలకు కరోనాపై అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు, చిరంజీవి కోడలు ఉపాసన, ప్రముఖ యాంకర్ సుమ ఇలా సెలబ్రిటీలంతా కరోనాపై ప్రజలకు అవేర్‌నెస్ కల్పిస్తున్నారు.