రిలాక్స్ న్యూస్ : పోలీస్ డ్యూటీ 8 గంటలే

పోలీసులకు గుడ్ న్యూస్
12 గంటలడ్యూటీకి చెల్లు చీటీ. ఇకపై 8 గంటలే
ఫ్రెండ్లీ పోలీసింగ్‌లో తెలంగాణ ఫస్ట్ ప్లేస్
వీక్టీ ఆఫ్స్ కూడా
హైదరాబాద్ : సాంకేతిక పరిజ్ఞాన వినియోగంలో పీపుల్ ఫ్రెండ్లీ పోలీసింగ్‌లో దేశంలోనే అగ్రస్థానంలో ఉన్న తెలంగాణ పోలీసు విభాగం ఇప్పుడు సిబ్బంది పనితనాన్ని పెంచేందుకు మరో కీలక నిర్ణయం వైపు అడుగులు వేస్తోంది. 8 గంటల పని విధానం..ఓటీ చేస్తే అలవెన్స్..వీక్లీ ఆఫ్స్ వంటి పలు కీలక నిర్ణయాలను అమలు చేసే దిశగా తెలంగాణ పోలీసు డిపార్ట్ మెంట్ యోచిస్తోంది. పంచాయతీ ఎన్నికల అనంతరం ఈవిధానం పాక్షికంగాను..లోక్‌సభ ఎన్నికల అనంతరం పూర్తిస్థాయిలో అమల్లోకి వచ్చే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. ఇప్పటికే నల్లగొండ జిల్లాలో వీక్లీ ఆఫ్స్ విధానాన్ని ప్రయోగాత్మకంగా చేపట్టి విజయవంతంగా కొనసాగించారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈ వారాంతపు సెలవుల విధానాన్ని రద్దు చేశారు. ఈ క్రమంలో పోలీసు డిపార్ట్ మెంట్ అధికారికంగా అమలు చేయనున్న ఈ కొత్త విధానంతో పోలీసులకు పని ఒత్తిడి తగ్గే అవకాశముంది.
వన్ స్టేట్, వన్ పోలీస్, వన్ ఎక్స్‌పీరియన్స్ టార్గెట్ అందుకోవాలంటే పోలీసులు ఆరోగ్యవంతమైన వాతావరణంలో పనిచేయాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఇందులో భాగంగానే షిఫ్ట్‌లు..వీక్లీ ఆఫ్స్..8 గంటల డ్యూటీ వంటి పలు కీలక నిర్ణయాల అమలు చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక పోలీసింగ్ మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం కల్పించటంతో ఇప్పటికే 10 వేల మంది ఎస్సై, కానిస్టేబుల్ స్థాయిలో నియమితులయ్యారు.మరో 18 వేల పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. పోలీసింగ్ మెరుగుపడాలంటే షిఫ్ట్ పద్ధతే సరైనదని బ్యూరో ఆఫ్ పోలీసు రీసెర్చ్ అండ్ డెవల్‌పమెంట్ (బీపీఆర్‌డీ), ఆస్కీ సంయుక్త అధ్యయనంలో తేలింది. సెలవులు లేకుండా డ్యూటీలోనే కంటిన్యూగా పనిచేయటంతో డ్యూటీని సమర్థవంతంగా చేయలేక తీవ్ర ఒత్తిడితో పోలీసులు అనారోగ్యం పాలవుతున్నారని ఓ సర్వే తేల్చింది. ఓవర్ డ్యూటీ చేస్తే ఓటీ సేలరీతో పాటు ట్రాన్స్ పోర్ట్ చార్జెస్ కూడా ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటోంది.
8 గంటల షిఫ్ట్‌తో ప్రజలకు మెరుగైన సేవలు అందిచ్చవచ్చు. క్వాలిటీ డ్యూటీని అందించవచ్చు. డ్యూటీని కమిట్ మెంట్ తో చేసే అవకాశం ఉంటుందని పోలీస్ డిపార్ట్ మెంట్ అంటోంది. తెలంగాణలో పూర్తి స్థాయిలో అమల్లోకి తెచ్చేందుకు ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. కమిషనర్లు, జిల్లా ఎస్పీల నుంచి అభిప్రాయాలు సేకరిస్తున్నారు. పూర్తి స్థాయిలో అమలు చేయడం సాధ్యమవుతుందా? ఆయా కమిషనరేట్లు, ఎస్పీల పరిధిలో ఎంత మంది సిబ్బంది ఉండాలి? వంటి వివరాలు సేకరిస్తున్నారు. పూర్తి నివేదిక అందిన తర్వాత 8 గంటల పని విధానం అమలు, అదనపు పని గంటలకు అలవెన్సుల చెల్లింపు, వీక్లీ ఆఫ్స్ పై తెలంగాణ పోలీస్ డిపార్ట్ మెంట్ నిర్ణయం తీసుకోనుంది.
బీపీఆర్‌డీ భారీ సర్వే ఎలా వుందంటే..
బీపీఆర్‌డీ, ఆస్కీ దేశవ్యాప్తంగా 23 రాష్ట్రాల్లో 319 పోలీసు స్టేషన్ల పరిధిలో 12వేల156 మంది కానిస్టేబుళ్లు, ఒక వెయ్యి 003 మంది స్టేషన్ హౌస్ ఆఫీసర్లు, 962 మంది సూపర్‌వైజరీ స్థాయి అధికారుల అభిప్రాయాలను తమ సర్వే ద్వారా తెలుసుకున్నారు. మెట్రోపాలిటన్, అర్బన్, అర్బన్-రూరల్ మిక్స్‌డ్, రూరల్, క్రైం, ట్రాఫిక్, ఉమెన్, ట్రైబల్ ఇతర తదితర 9 రకాల పోలీసు స్టేషన్లను శాంపిల్‌గా తీసుకున్నారు. 8 గంటల షిప్టు విధానం అమలు చేయాలంటే ఎంత మంది సిబ్బంది అవసరమో కూడా బీపీఆర్‌డీ, ఆస్కీ లెక్కించింది. రెస్ట్ లేకుండా ఓవర్ డ్యూటీ చేయటం వల్ల పనితీరు మందగిస్తుందని, పోలీసు వ్యవస్థతో రావాల్సిన మంచి ఫలితాల కన్నా దుష్పలితాలు వస్తాయని అధ్యయనంలో పేర్కొన్నారు. షిప్టు విధానం అమలు చేస్తే పోలీసుల పనితీరును 1.68 రెట్లు మెరుగు పరుచుకోవచ్చని అభిప్రాయపడింది. ప్రస్తుతం దేశంలో పోలీసు స్టేషన్లలో సిబ్బంది కేవలం 30 శాతం మాత్రమే అందుబాటులో ఉన్నారు. దీన్ని పెంచేందుకు తెలంగాణ సర్కారు భారీ ఎత్తున రిక్రూట్‌మెంట్లు చేపడుతోంది