గాలి బెయిల్ డీల్ కేసు విచారణ వాయిదా

కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి బెయిల్ డీల్ కేసును ఏసీబీ కోర్టు వాయిదా వేసింది. గతంలో మైనింగ్ కేసులో గాలి అరెస్టు అయిన సంగతి తెలిసిందే. దీనిపై ఏసీబీ కోర్టు విచారిస్తోంది. 2019, ఆగస్టు 26వ తేదీ సోమవారం విచారించిన కోర్టు.. సెప్టెంబర్ 12వ తేదీకి వాయిదా వేసింది. అప్పట్లో చంచల్ గూడ జైల్లో ఉన్న గాలి జనార్థన్ రెడ్డికి బెయిల్ ఇప్పించాలని కోరుతూ అతని బంధువు దశరథరామిరెడ్డి రూ.100 కోట్లకు డీల్ కుదిర్చినట్లు ఆరోపణలున్నాయి.
ఈ డీల్ సమయంలోనే ఏసీబీకి పట్టుబడ్డారు జడ్జి. విచారణలో అనేక విషయాలు వెల్లడించారు. గాలికి బెయిల్ ఇచ్చిన సీబీఐ జడ్జీ పట్టాభిపై కేసు నమోదైంది. ఈ డీల్‌లో సహకరించారనే ఆరోపణలపై అప్పటి ఎమ్మెల్యేలు సోమశేఖర్ రెడ్డి, సురేష్ రెడ్డిలపైనా కేసు నమోదు చేశారు. ఈ కేసులో జడ్జి ప్రభాకర్ రావు ఆరోపణలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. బెయిల్ ఇచ్చేందుకు ప్రభాకరరావు భారీ మొత్తంలో డబ్బులు తీసుకొన్నారనే ఆరోపణలు వచ్చాయి. ఈయన అనుమానాస్పదస్థితిలో మృతి చెందడం అప్పట్లో కలకలం రేపింది.
ఈడీ జప్తు చేసిన ఆస్తులను విడుదల చేయాలని గాలి జనార్ధన్ రెడ్డి ఇటీవలే డిమాండ్ చేశారు. కేసులను కర్ణాటక హైకోర్టు కొట్టివేసిందని, ఆస్తులను తనకు అప్పగించాలని కోర్టు సూచించిందన్నారు. దీనిపై ఈడీ సుప్రీంకు వెళ్లిందని..హైకోర్టు తీర్పును సుప్రీం సమర్థించిందన్నారు.