ప్రభుత్వ స్కూళ్లలో Google ల్యాబ్స్!

తెలంగాణ రాష్ట్రంలోని అన్ని గవర్నమెంట్ స్కూళ్లలో గూగుల్ ల్యాబ్‌లను ఏర్పాటు చేసేందుకు గూగుల్ క్లౌడ్ ముందుకొచ్చిందని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ విజయ్ కుమార్ తెలిపారు. ఈ ల్యాబ్ ద్వారా ఆరు నుంచి పదో తరగతి వరకు పాఠాలు బోధించడం జరుగుతోందని, రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలో ఇది అమలు చేయాలనే లక్ష్యంతో ఉన్నామన్నారు.
నగరంలో ఉన్న విజయ్ నగర్ కాలనీ ప్రభుత్వ పాఠశాలలో రెండు సంవత్సరాలుగా గూగుల్ ల్యాబ్ సాయంతో విద్యాబోధన జరుగుతోందని గుర్తు చేశారు. దేశంలో ఇదే తొలి పాఠశాలన్నారు. గూగుల్ ల్యాబ్‌తో ఉత్తమ ఫలితాలు వస్తున్నాయని చెప్పిన కమిషనర్..గూగుల్ క్లౌడ్ సాఫ్ట్ వేర్ సహకారం అందించడానికి ముందుకొచ్చిందన్నారు. అయితే..హార్డ్ వేర్ ప్రభుత్వమే భరించాల్సి ఉండడంతో దీనిపై చర్చించాల్సి ఉన్నదన్నారు. ఇంటర్నేషనల్ స్కూళ్లలో అమలు చేస్తున్న ఈ విధానాన్ని సర్కారు స్కూళ్లలో అందుబాటులోకి వస్తే..నిరుపేదలకు మెరుగైన విద్య అందుతుందని కమిషనర్ అభిప్రాయం వ్యక్తం చేశారు.
ప్రభుత్వ పాఠశాలల్లో కంప్యూటర్ ల్యాబ్‌లు ఏర్పాటు చేసుకుంటే..సాఫ్ట్ వేర్ సహాయం అందించడంతో పాటు టీచర్లకు శిక్షణ ఇచ్చేందుకు గూగుల్ ముందుకొచ్చిందన్నారు. ల్యాబ్‌ల ఏర్పాటు అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళుతామని, వాటి ఏర్పాటుతో విద్యార్థులకు మెరుగైన విద్యను అందించవచ్చన్నారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీతో పాటు నగదు ఆయన అందచేశారు.
Read More : బ్రేకింగ్ : నిండిన హుస్సేన్ సాగర్..నీరు విడుదల