తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన

ఓ వైపు నైరుతి రుతుపవనాలు తగ్గుముఖం పట్టగా.. మరోవైపు ఈశాన్య రుతుపవనాలు దూసుకు వచ్చేస్తున్నాయి. ఇప్పటికే కోస్తాంధ్ర, తెలంగాణ నుంచి వెళ్లిపోయిన నైరుతి రుతుపవనాలు… దక్షిణ భారతదేశం నుంచి పూర్తిగా వెనుదిరిగేందుకు అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇదే సమయంలో ఆగ్నేయ భారత దేశంలో ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించే సూచనలున్నాయంటున్నారు వాతావరణ శాఖ అధికారులు.
ఈ ఏడాది ఆలస్యంగా ఎంటరైన నైరుతి రుతుపవనాలు… ఇప్పుడిప్పుడే తిరుగుముఖం పడుతున్నాయి. ఇంతలోనే ఈశాన్య రుతుపవనాలు ఎంట్రీ ఇస్తున్నాయి. ఇవి రేపు దక్షి భారతదేశంలో ప్రవేశించే అవకాశముంది. దీంతో ఈరోజు, రేపు రెండు తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరోవైపు… తూర్పు భారతం నుంచి తేమ గాలులు వీస్తుండటంతో తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశముందంటున్నారు వాతావరణ శాఖ అధికారులు.
ఈశాన్య రుతుపవనాలతో దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతంలోనూ ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉంది. ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కూడా కురియవచ్చు. రాయలసీమలోను రెండ్రోజులపాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
రావాల్సిన సమయం కంటే ఆలస్యంగా వచ్చిన నైరుతి రుతుపవనాలు… అక్టోబర్ 1 నాటికే వెనుదిరగాల్సిన ఉన్నా.. పలు రాష్ట్రాల్లో ఇంకా కొనసాగుతుండటంతో ఇప్పటికీ వర్షాలు పడుతున్నాయి. తొలకరి జల్లులకే ఎంతగానో ఎదురుచూసేలా చేసిన నైరుతి రుతుపవనాలు… ఆ తర్వాత కుండపోత వర్షాలతో పలు రాష్ట్రాలను అతలాకుతలం చేశాయి. దీంతో రికార్డు స్థాయిలో సగటున 110 శాతం వర్షపాతం నమోదయ్యింది. 1994 తర్వాత ఇంత భారీ స్థాయిలో వర్షపాతం నమోదవడం ఇదే తొలిసారి. అయితే నైరుతి రుతుపవనాలతో వణికిపోయిన జనం ఈశాన్య రుతుపవనాలు ఎంత ఎఫెక్ట్ చూపిస్తాయనోనని ఆందోళన చెందుతున్నారు.