సచివాలయ భవనాల కూల్చివేతపై హైకోర్టు స్టే

తెలంగాణ రాష్ట్ర సచివాలయ భవనాల కూల్చివేతపై హైకోర్టు స్టే ఇచ్చింది. పిటిషన్ పై విచారణ జరిగే వరకు భవనాలను కూల్చివేయవద్దని తెలిపింది. సచివాలయం కూల్చివేత పిటిషన్‌పై మంగళవారం (అక్టోర్ 1, 2019) విచారణ చేపట్టిన కోర్టు.. స్టే ఇచ్చింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు సచివాలయ భవనాలను కూల్చొద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది. దసరా సెలవుల అనంతరం పిటిషన్ పై విచారణ చేపడతామని తెలిపింది. అప్పటి వరకు భవనాలు కూల్చొద్దని ఆదేశాలు జారీ చేసింది.
అయితే కొత్త సచివాలయ భవన సముదాయనిర్మాణంపై మంత్రివర్గ ఉపసంఘం సమర్పించిన నివేదికను ఇవాళ తెలంగాణ కేబినెట్ ఆమోదించనున్న వార్తల క్రమంలో కోర్టు ఈ తీర్పు వెలువడటం గమనార్హం. కేబినెట్ భేటీ అనంతరం సచివాలయ భవనాల కూల్చివేత, కొత్త సచివాలయ భవన సముదాయం నిర్మాణానికి సంబంధించిన పనులకు శ్రీకారం చుట్టాలని భావించిన కేసీఆర్ ప్రభుత్వానికి కోర్టు తీర్పుతో ఎదురుదెబ్బ తగిలినట్లైంది.