బాబులూ తెచ్చిపెట్టుకోండి : హైదరాబాద్ లో లిక్కర్ బంద్

  • Published By: veegamteam ,Published On : March 19, 2019 / 03:48 AM IST
బాబులూ తెచ్చిపెట్టుకోండి : హైదరాబాద్ లో లిక్కర్ బంద్

హైదరాబాద్ : రంగుల వేడుక హోలీ పండుగ సందర్భంగా హైదరాబాద్ లో మద్యం దుకాణాలు బంద్ కానున్నాయి. మార్చి 20వ తేదీ హోలీ పండుగ సందర్భంగా మార్చి 20 తేదీ సాయంత్రం 6 గంటల నుంచి 22వ తేదీ సాయంత్రం ఆరు గంటల వరకు హైదరాబాద్‌లోని మద్యం దుకాణాలు బంద్ చేస్తున్నట్లు సీపీ అంజనీ కుమార్ ప్రకటించారు. నగర ప్రజలు హోలీని ఆనందంగా జరుపుకోవాలని కోరారు. హోలీ  వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. 

హోలీ వేడుకల్లో భాగంగా 48 గంటలు హైదరాబాద్ సిటీ వ్యాప్తంగా ఉన్న మద్యం దుకాణాలతో పాటు కల్లు కాంపౌండ్‌లు, బార్ అండ్ రెస్టారెంట్‌లను మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఎవరికీ ఇబ్బంది కలగకుండా హోలీ వేడులను ప్రజలు జరుపుకోవాలని.. జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వాహనాలపై గుంపులు..గుంపులుగా ప్రయాణించవద్దని.. ప్రయాణీకులపై, వాహనదారులపై వారి అనుమతి లేకుండా బలవంతంగా రంగులు చల్లరాదని సూచించారు. అలా చేస్తే కఠిన చర్యలు తీసుకోవటం జరుగుతుందని హెచ్చరించారు సీపీ.