హైదరాబాదీలకు ఆధార్ నోటీసులపై అసదుద్దీన్ ఫైర్

  • Published By: chvmurthy ,Published On : February 19, 2020 / 07:27 AM IST
హైదరాబాదీలకు ఆధార్ నోటీసులపై అసదుద్దీన్ ఫైర్

Updated On : February 19, 2020 / 7:27 AM IST

పౌరసత్వాన్ని నిరూపించుకోవాలంటూ హైదరాబాద్‌లో నివసిస్తున్న 127 మందికి భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ Aadhaar (ఉడాయ్‌) నోటీసులు జారీ చేయడంపై  ఏఐఎంఐఎం చీఫ్‌, ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ ఉడాయ్‌, తెలంగాణ పోలీసులపై తీవ్రంగా మండిపడ్డారు. ఉడాయ్‌ నోటీసులు అందుకున్న 127 మందిలో ముస్లింలు, దళితులు ఎంతమంది ఉన్నారని  ఆయన  ట్విట్టర్ లో ప్రశ్నించారు.

ఆధార్‌ సంస్థ తన అధికారాలను దుర్వినియోగం చేసిందని, సరైన ప్రామాణికాలు అనుసరించకుండానే పక్షపాత వైఖరితో వ్యవహరించిందని ఆరోపించారు. కార్డన్‌ సెర్చ్‌ కార్యక్రమంలో ఆధార్‌ చూపమని అడగటం  పోలీసులు విరమించుకోవాలని, ఇలా చేయడానికి మీకు చట్టబద్ధ అనుమతి లేదని తెలంగాణ పోలీసులను ఉద్దేశించి అసదుద్దీన్ ట్వీట్‌ చేశారు.

 

నోటీసులో పౌరసత్వ వెరిఫికేషన్‌ అనే పదాన్ని ఉపయోగించారని, ఆధార్‌ వ్యాలిడిటీ గురించి ప్రస్తావించలేదని, ఈ నోటీసును జారీ చేసిన డిప్యూటీ డైరెక్టర్‌ను ఉడాయ్‌ సస్పెండ్‌ చేయాలని మరో ట్విట్టర్ పోస్టులో ఆయన కోరారు.  కాగా …   ఉడాయ్(ఆధార్ ) అధికారులకు రాష్ట్ర పోలీసుల నుండి వచ్చిన నివేదికలు ఆధారంగా  నోటీసులు జారీ చేయబడినట్లు తెలిసింది.  ఆధార్ పంపిన నోటీసులకు “పౌరసత్వంతో సంబంధం లేదని… ఆధార్ కార్డు రద్దు చేయడం ఏ నివాసి యొక్క జాతీయతకు సంబంధించినది కాదని ఆధార్ తన ట్విట్టర్ లో తెలిపింది.

కాగా….. మహ్మద్ సత్తార్ ఖాన్ అనే వ్యక్తి హైదరాబాద్‌లో నివసిస్తున్నాడు. హైదరాబాద్ అడ్రస్‌తో అతడికి ఆధార్ కార్డు కూడా ఉంది. ఆటో రిక్షా నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఫిబ్రవరి 3న ఖాన్‌కు ఆధార్ సంస్థ UIDIA నుంచి నోటీసులు వచ్చాయి. నువ్వు భారత పౌరుడివి కాదు.. తప్పుడు ధృవపత్రాలను సృష్టించి ఆధార్ కార్డ్ తీసుకున్నట్లు ఫిర్యాదు అందిందని తెలిపింది.

ఈ నేపథ్యంలో భారత పౌరసత్వాన్ని నిరూపించుకోవాలని స్పష్టం చేసింది. ఫిబ్రవరి 20న రంగారెడ్డిలోని బాలాపూర్‌ రాయల్ కాలనీలోని మెగా గార్డెన్స్ లో ఎంక్వైరీ ఆఫీసర్ ఎదుట హాజరై పౌరసత్వాన్ని నిరూపించుకునేందుకు అవసరమైన అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్లు చూపించాలని ఆదేశించింది. 

ఒకవేళ ఈ విచారణకు హాజరు కాకపోయినా, పౌరసత్వం నిరూపించుకునేందుకు అవసరమైన డాక్యుమెంట్లు సమర్పించకపోయినా.. భారతీయ పౌరుడు కాదనే ఆరోపణను నిజంగా భావించాల్సి ఉంటుందన్నారు. ఒకవేళ భారత పౌరుడివి కాకుంటే.. దేశంలోకి చట్టబద్ధంగా ప్రవేశించినట్లుగా నిరూపించుకోవాల్సి ఉంటుందని UIDIA తేల్చిచెప్పింది. విచారణకు రాకుంటే సుమోటోగా తాము నిర్ణయం తీసుకుంటామని హెచ్చరించింది. అలాగే, రూల్ 29 ప్రకారం ఆధార్ కార్డును కూడా రద్దు చేస్తామని వెల్లడించింది.  

ఇదే విధంగా మొత్తం 127 మందికి నోటీసులు జారీ చేసిన ఉడాయ్‌ అన్ని ఒరిజినల్‌ సర్టిఫికెట్లతో ఫిబ్రవరి 20లోగా విచారణకు రావాలని వారిని ఆదేశించింది. సరైన పత్రాలు సమర్పించక పోయినా, భారత పౌరులమని నిరూపించుకోలేకపోయినా వారి ఆధార్‌ కార్డులను రద్దు చేస్తామని హెచ్చరించింది.

ఆధార్  ఇచ్చిన నోటీసుల ఫలితంగా  ప్రజలలో భయాందోళనలు మొదలయ్యాయని ఒవైసీ అన్నారు. అసలు పౌరసత్వాన్ని ధృవీకరించే అధికారం యుఐడిఎఐకి లేదంటూ  ఎంపీ అసదుద్దీన్  ఆధార్ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు.

Read More>> సీఎం జగన్‌కు నాని సవాల్.. చంద్రబాబుని ఓడిస్తానన్న ఎంపీపై ప్రశంసలు