ఫీజు వాపస్, పరిహారం : నుమాయిష్ బాధితులకు రిలీఫ్

హైదరాబాద్: నాంపల్లి నుమాయిష్ అగ్నిప్రమాదంలో సర్వస్వం కోల్పోయిన బాధితులకు ఎగ్జిబిషన్ సొసైటీ కొంత ఊరట ఇచ్చే నిర్ణయం తీసుకుంది. ఫైర్ యాక్సిడెంట్‌లో దగ్ధమైన స్టాల్స్ ఫీజు వెనక్కి ఇస్తామన్నారు. కాలిపోయిన స్టాల్స్‌ను తిరిగి నిర్మించాలని నిర్ణయించారు. ఎవరెంత నష్టపోయారో నివేదిక వచ్చాక అందులో సగం మొత్తం చెల్లించాలని సొసైటీ నిర్ణయించింది. ఎగ్జిబిషన్‌ను మరో 15 రోజుల పాటు పొడిగించాలని డెసిషన్ తీసుకున్నారు. అదనపు 15 రోజుల్లో సందర్శకుల టికెట్ల మొత్తాన్ని నష్టపోయిన బాధితులకు పంపిణీ చేస్తామన్నారు.
* నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ కీలక నిర్ణయాలు
* అగ్నిప్రమాదంలో దగ్ధమైన స్టాల్స్ పీజు వెనక్కి
* కాలిపోయిన స్టాల్స్‌ను తిరిగి నిర్మించాలని నిర్ణయం
* ఎవరెంత నష్టపోయారో నివేదిక వచ్చాక సగం మొత్తం చెల్లించాలని నిర్ణయం
* ఎగ్జిబిషన్‌ను మరో 15 రోజులు పొడిగించాలని నిర్ణయం
* అదనపు 15రోజుల్లో సందర్శకుల టికెట్ల మొత్తాన్ని నష్టపోయిన స్టాల్స్‌కు పంపిణీ
2019, జనవరి 30వ తేదీ బుధవారం రాత్రి నాంపల్లిలోని ఎగ్జిబిషన్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించిన విషయం విదితమే. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరిగింది. 40కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. 175 స్టాల్స్ కాలిబూడిదయ్యాయి. మరో 225 స్టాల్స్ పాక్షికంగా దహనమయ్యాయి. దగ్ధమైన స్టాళ్లలో చేనేత, దుస్తులు, గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, చెప్పుల స్టాల్స్ అధికంగా ఉన్నాయి. దీంతో ఆ స్టాళ్ల యజమానులు తీవ్రంగా నష్టపోయారు. సర్వస్వం కోల్పోయి రోడ్డుపడ్డారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని వేడుకుంటున్నారు. దుకాణాల నిర్వాహకులను ఆదుకుంటామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఈ క్రమంలో ఎగ్జిబిషన్ సొసైటీ వారికి కొంత ఊరట ఇచ్చే నిర్ణయాలు తీసుకుంది.