తెలుగు రాష్ట్రాల్లో ఐటీ వరుస దాడులు.. రాజకీయ ప్రకంపనలు 

తెలుగు రాష్ట్రాల్లో ఐటీ శాఖ వరుస దాడులు చేస్తోంది. చంద్రబాబు మాజీ పీఎస్‌తో పాటు ఏపీ, తెలంగాణలోని కంపెనీల్లో సోదాలు నిర్వహిస్తోంది.

  • Published By: veegamteam ,Published On : February 11, 2020 / 01:20 AM IST
తెలుగు రాష్ట్రాల్లో ఐటీ వరుస దాడులు.. రాజకీయ ప్రకంపనలు 

Updated On : February 11, 2020 / 1:20 AM IST

తెలుగు రాష్ట్రాల్లో ఐటీ శాఖ వరుస దాడులు చేస్తోంది. చంద్రబాబు మాజీ పీఎస్‌తో పాటు ఏపీ, తెలంగాణలోని కంపెనీల్లో సోదాలు నిర్వహిస్తోంది.

తెలుగు రాష్ట్రాల్లో ఐటీ శాఖ వరుస దాడులు చేస్తోంది. చంద్రబాబు మాజీ పీఎస్‌తో పాటు ఏపీ, తెలంగాణలోని కంపెనీల్లో సోదాలు నిర్వహిస్తోంది. ఇప్పటిదాకా తనిఖీల్లో ఐటీ, జీఎస్టీ అధికారులు కీలక ఆధారాలు సేకరించారు. ఆదాయపన్ను శాఖ, కేంద్ర జీఎస్టీ అధికారులను బురిడీ కొట్టించిన పలు కంపెనీల మేనేజర్లతో పాటు చంద్రబాబు పీఎస్‌గా చేసిన శ్రీనివాస్ రావుపై ఐదు రోజులుగా దాడులు చేశారు. ఢిల్లీ నుంచి వ‌చ్చిన ఐటీ అధికారులు కేంద్ర బ‌ల‌గాల బందోబ‌స్తుతో సోదాలు చేపట్టారు. చంద్రబాబు మాజీ పీఎస్‌ ఇంట్లో చేసిన సోదాల్లో కోట్ల రూపాయల ఆస్తులను గుర్తించారు. 

కడప, విశాఖపట్నం, హైదరాబాద్‌లో జరిపిన దాడుల్లో బ్యాంక్ లాకర్ల నుంచి డాక్యుమెంట్లు, బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ముంబైకి చెందిన కంపెనీలో గతంలోనూ సోదాలు చేసిన జీఎస్టీ, ఐటీ అధికారులకు 69 కోట్ల ఫ్రాడ్ జరిగినట్లు ఆధారాలు సేకరించారు. తప్పుడు ఇన్‌డెంట్లు, నకిలీ ధ్రువపత్రాలు సృష్టించి జీఎస్టీ ఎగ్గొట్టడానికి ప్రయత్నించినట్లు అధికారులు గుర్తించారు. దీంతో శ్రీనివాస్ రావును డైరెక్టరేట్‌ ఆఫ్‌ జీఎస్‌టీ ఇంటెలిజెన్స్‌ విభాగం అదుపులోకి తీసుకుని విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గ‌త ప్రభుత్వంలో చేపట్టిన ప్రాజెక్టులకు కాంట్రాక్టర్లను కేటాయించ‌డంలోనూ శ్రీనివాస్‌ కీల‌క పాత్ర పోషించినట్లు తెలుస్తోంది.

ఏపీ, తెలంగాణకు చెందిన డీఎన్సీ ఇన్‌ఫ్రా, ఆర్ఆర్ ఇన్‌ఫ్రా, ఆర్కే ఇన్‌ఫ్రా కంపెనీలు, కంపెనీ డైరెక్టర్ల ఇళ్లపై సోదాలు చేసి కీలక ఆధారాలు సేకరించారు. బంజారాహిల్స్‌లోని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు ప్రత్తిపాటి శరత్‌కు చెందిన ఆవేక్సా కార్పొరేషన్ కంపెనీలోనూ, జర్నలిస్టు కాలనీలో ఉంటున్న కిలారి రాజేష్ ఇంట్లోనూ ఐటీ, జీఎస్టీ అధికారులు సోదాలు చేపట్టి పలు ఆస్తులను గుర్తించారు. 

ఐదురోజులుగా తెలుగు రాష్ట్రాల్లో జరిగిన జీఎస్టీ, ఐటీ అధికారుల సోదాలు రాజకీయంగానూ ప్రకంపలు సృష్టించాయి. సోదాలు జరిగిన పలు కంపెనీలతో పాటు కంపెనీ డైరెక్టర్లు, మేనేజర్ల వెనుక టీడీపీ నేతల హస్తం ఉందన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. దీంతో ఎవరి పేరు ఎప్పుడు బయటపడుతుందోనని నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.