బాబోయ్.. ఒక్క కోతి ఆ ఊరినే వణికిస్తోంది

బాబోయ్.. ఒక్క కోతి ఆ ఊరినే వణికిస్తోంది

‘తా చెడ్డ కోతి వనమెల్లా చెరిచింది’ అని పాత సామెత. కానీ, ఇక్కడ చెడగొట్టడానికి ఏమీ లేదు. అంతా రక్తపాతాలే. పెంపుడు కుక్కల్ని చంపేస్తుంది. ఎదురుతిరిగిన మనుషుల్ని గాయపరుస్తుంది. ఆకలేసిందంటే ఏ ఇంట్లోకైనా దూరిపోతుంది. ఒకే ఒక్క కోతి.. ఈ అరాచకాలన్నిటికీ కారణంగా మారింది.  గ్రామానికి దగ్గర్లో ఉన్న గుడి దగ్గర్నుంచి వచ్చి ఆ గ్రామంలోనే స్థిరపడిపోయింది. 

హైదరాబాద్‌కు చెందిన బండ్లగూడ జాగీర్ ప్రాంతంలో కొన్ని నెలలుగా ఓ కోతి.. క్రూర మృగం కంటే ప్రమాదకరంగా మారింది. ఆకలేస్తే ఇళ్లలో దూరిపోతుంది. వెళ్లగొట్టడానికి ప్రయత్నిస్తే.. మనుషులను గాయపరుస్తుంది. పెంపుడు కుక్కలు  మీదకు వెళితే.. వాటి ప్రాణాలు తీసిన సందర్భాలు కూడా ఉన్నాయి. దీనిపై అధికార యంత్రాంగం చర్యలు తీసుకోకపోవడంతో స్థానికులు బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నారు. దాదాపు పగటి సమయంలో కూడా తలుపులు మూసే ఉంచుకుంటున్నారు. 

జీహెచ్ఎంసీకి ఫిర్యాదు చేస్తే… గ్రామ పంచాయతీ పరిధికే చెందుతుందని, పంచాయతీ ఆఫీసుకు వెళ్తే జీహెచ్ఎంసీ వాళ్లే పట్టించుకోవాలని దాటేస్తున్నారు. దీంతో ప్రజలు ఏం చేయాలో అర్థం కాక కోతి భయంతో బతకాల్సి వస్తుంది.  జీహెచ్ఎంసీ అధికారి ఒకరు స్పందిస్తూ.. ఇదంతా పంచాయతీ పరిధిలోకి మాత్రమే వస్తుంది. కోతి అల్లర్లు గురించి వారే చూసుకోవాలి. అటవీ శాఖతో చర్చలు జరిపి తీసుకుని వెళ్లి అడవిలో వదిలేయాలి’ అని జీహెచ్ఎంసీ చీఫ్ వెటర్నరీ ఆఫీసర్ స్పందించారు.