హైదరాబాద్ ముసుగుదొంగ దొరికాడు

హైదరాబాద్ ముసుగుదొంగ దొరికాడు

Updated On : September 17, 2019 / 5:10 AM IST

అయిదేళ్లుగా ముసుగేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తి పోలీసుల చేతికి చిక్కాడు. వ్యూహం ప్రకారం.. వల వేసి పట్టుకోవడమే కాక అతడి నుంచి రూ.25లక్షల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నారు. వివరాలను నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్.. సీసీఎస్ సంచయుక్త కమిషనర్ అవినావ్ మహంతితో కలిసి సోమవారం కమిషనరేట్‌లో వెల్లడించారు. చాంద్రాయణగుట్ట ఠాణా పరిధిలో కొన్నాళ్లుగా జరుగుతున్నాయంటూ ఫిర్యాదులు అందాయి. ఇవి అరికట్టాలనే ఉద్దేశ్యంతో ఫలక్‌నమా డివిజన్ అదనపు డీసీపీ ఎం రషీద్ ఆదేశాలమేరకు ఇన్‌స్పెక్టర్ రుద్రభాస్కర్, క్రైమ్ ఎస్సై కొండల్ రావు గస్తీ ముమ్మరం చేశారు. 

ఇందులో భాగంగానే పీలి దర్గా వద్ద సోమవారం తెల్లవారుజామున అనుమానస్పదంగా సంచరిస్తూ ఓ వ్యక్తి కనిపించాడు. అతణ్ని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు పోలీసులు. విలువైన ఆభరణాలు అతని వద్ద ఉన్నాయని గమనించడంతో ఠాణాకు తరలించి విచారించారు. చాంద్రాయణగట్టు బండ్లగూడకు చెందిన కారుడ్రైవర్ మహ్మద్ సమీర్ అలియాస్ లాలా(36)గా గుర్తించారు. కుటుంబాన్ని యాఖుత్ పురాలో ఉంచాడు. పదేళ్ల క్రితం మకాం మార్చుకుని మహ్మద్ నగర్‌కు వచ్చేశాడు. గతంలో చోరీ చేసిన ద్విచక్ర వాహనాన్ని కొనుగోలు చేశాడని చార్మినార్ పోలీసులు అరెస్టు చేశారు. 

జైలు నుంచి విడుదలైన తర్వాత సౌదీ వెళ్లి కొంతకాలం కారుడ్రైవర్ గా పనిచేశాడు. అక్కడ పని చేయలేక హైదరాబాద్‌కు తిరిగొచ్చేశాడు. సులభంగా డబ్బు ఆర్జించాలనే ఉద్దేశంతో చోరీల బాట పట్టాడు. ఆ సొమ్మును మద్యం, జూదానికి వినియోగించేవాడు. అయిదేళ్లలో 9ఇళ్లలో లాలా చోరీలకు పాల్పడ్డాడు. అతడి నుంచి సుమారు రూ.25లక్షల విలువైన 520గ్రాముల బంగారు ఆభరణాలు 1040గ్రాములు వెండి ఆభరణాలు, సోనీ ఎల్సీడీ టీవీ, 2000సౌదీ కరెన్సీతో పాటు చోరీకి వినియోగించే పరికరాలను స్వాధీనం చేసుకున్నారు.