చర్చలకు వేళాయే : ఎజెండాలో లేని ఆర్టీసీ విలీనం!

తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ సమ్మె కొనసాగుతోంది. అక్టోబర్ 05వ తేదీ నుంచి కార్మికులు సమ్మెలోకి వెళ్లిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం..కార్మికుల మధ్య చర్చల ప్రక్రియ ఓ కొలిక్కి రాకపోవడంతో ప్రతిష్టంభన నెలకొంది. తాజాగా హైకోర్టు ఆదేశాల మేరకు ఆర్టీసీ కార్మికులతో చర్చల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఆర్టీసీ జేఏసీ నేతలతో చర్చలకు సీఎం కేసీఆర్ అంగీకరించడంతో.. ఆర్టీసీ యాజమాన్యం అందుకు సిద్ధమైంది. కానీ ఏజెండాలో ఆర్టీసీ విలీనం లేదని తెలుస్తోంది. ఆర్థికంగా భారం కాని డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్లు సమాచారం.
2019, అక్టోబర్ 26వ తేదీ శనివారం ఉదయం 11 గంటలకు ఈడీల స్థాయిలో ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరుపనున్నారు. బస్ భవన్ ఇందుకు వేదిక కానుంది.
ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో కార్మికులతో చర్చలు జరపాలని హైకోర్టు సూచించింది. న్యాయస్థానం సూచన మేరకు ఆర్టీసీ కార్మికుల డిమాండ్లలో 21 అంశాలను పరిశీలించి నివేదిక అందజేయాలని ఈడీ వెంకటేశ్వరరావు నేతృత్వంలో అధికారుల కమిటీని ఆర్టీసీ ఎండీ నియమించారు. కార్మికుల డిమాండ్లపై ఈడీల కమిటీ కసరత్తు చేసింది. వాటిలో ఏయే డిమాండ్లు నెరవేరిస్తే ఆర్టీసీపై ఎంత ఆర్థిక భారం పడుతుంది.. కార్మికుల డిమాండ్లలో ఏవి సాధ్యం.. ఏవి సాధ్యం కాదు అన్న అంశాలపై ఈడీల కమిటీ పూర్తి స్థాయిలో అధ్యయనం చేసింది.
గత రెండు మూడ్రోజులుగా అధ్యయనం చేసిన కమిటీ శుక్రవారం ఆర్టీసీ ఎండీ సునీల్‌శర్మకు నివేదిక అందజేసింది. ఈ నివేదికను 28న జరిగే విచారణలో ప్రభుత్వం హైకోర్టుకు సమర్పించనుంది. ఈడీల కమిటీ ఇచ్చిన నివేదికపై సీఎం కేసీఆర్ సుదీర్ఘంగా చర్చించారు. కార్మిక సంఘాలతో చర్చలకు పచ్చజెండా ఊపారు. మరి ఈ చర్చలు ఫలప్రదం అవుతాయా ? లేదా ? అనేది తెలుసుకోవాలంటే కొద్ది గంటలు వెయిట్ చేయాల్సిందే.
Read More : ఆర్టీసీ కార్మికులతో చర్చలకు సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్