ఒక్క మనిషిని కూడా ఉపవాసం ఉండనివ్వం : కేసీఆర్

ప్రపంచంలో ఇప్పటివరకూ కరోనా వైరస్‌కు మందు లేదని, వ్యాప్తిని నివారించడమే పెద్ద ముందు అని కేసీఆర్ స్పష్టం చేశారు. శుక్రవారం ఒక్కరోజే 10 కరోనా పాజిటీవ్ కేసులు నమోదైనట్టు చెప్పారు. 20వేల మంది క్వారంటైన్‌లో ఉన్నట్టు తెలిపారు. మన చేతిలో ఉన్న ఏకైక ఆయుధం సోషల్ డిస్టన్స్ మాత్రమేనని, అందరూ సామాజిక దూరం, స్వయం నియంత్రణ తప్పక పాటించాల్సిన అవసరం ఉందని కేసీఆర్ స్పష్టం చేశారు. ఐసోలేషన్ వార్డులో 11వేల మంది ఉండవచ్చునని చెప్పారు.
1400 ఐసీయూ బెడ్స్.. గచ్చిబౌలి స్టేడియంలో సిద్ధం :
1400 ఐసీయూ బెడ్స్ గచ్చిబౌలి స్టేడియంలో సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. 500 వెంటిలేటర్ల కోసం ఆర్డర్ ఇచ్చామన్నారు. స్వీయ నియంత్రణే మనకు శ్రీరామ రక్ష అన్నారు. నిపుణుల అంచనాల ప్రకారం జాగ్రత్తలు తీసుకోకపోతే.. ఇటలీ, స్పెయిన్ స్థాయిలో వస్తే దేశంలో 20 కోట్లమందికి కరోనా సోకే ప్రమాదం ఉందని కేసీఆర్ చెప్పారు. పూర్తిస్థాయిలో కరోనా వ్యాపించినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. యావత్ ప్రపంచమే యుద్ధంలో పాల్గొంటోందని కేసీఆర్ అన్నారు.
12,400 మందికి ఏకకాలంలో ట్రీట్ మెంట్ ఇవ్వగలం :
60వేల మంది వరకు పాజిటివ్ కేసులు వచ్చినా చికిత్స అందించేందుకు సన్నద్ధమయ్యామని కేసీఆర్ చెప్పారు. 12,400 మందికి ఏకకాలంలో ట్రీట్ మెంట్ ఇవ్వగల స్థాయిలో ఉన్నామని తెలిపారు. ప్రజలు ఏ దశలో కూడా నిర్లక్ష్యం కానీ, అలసత్వం కానీ వహించొద్దని సూచించారు. మనం భయంకరమైన మహమ్మారితో యుద్ధం చేస్తున్నామని చెప్పారు. ఒక్క మనిషిని కూడా ఉపవాసం ఉండనివ్వమని కేసీఆర్ స్పష్టం చేశారు.
కదిలికలను నివారిస్తేనే అరికట్టగలమని మోడీ చెప్పారు :
కదలికలను నివారిస్తేనే కరోనాను అరికట్టగలమని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారని కేసీఆర్ అన్నారు. ప్రజల కదలికలు ఆగితే చాలు.. అందరికీ అన్నం పెడతామని తెలిపారు. పశుగ్రాసం తీసుకెళ్లే వాహనాలు యధావిధిగా తిరగొచ్చునని స్పష్టం చేశారు. కూరగాయల కోసం గుంపులుగా పోవద్దని అన్నారు.
ఈ పరిస్థితుల్లో ఎవరూ ఆకలికి గురికాకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇతర కూలీలను ఆదుకోవాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసినట్టు తెలిపారు. ప్రజలు సహకరించండి.. ఎక్కడివారు అక్కడే ఉండాలని తెలిపారు. నిత్యావసర సరుకుల కోసం అందరూ ఒక్కసారే బయటకు పోవద్దని కేసీఆర్ సూచించారు.