తప్పుడు ప్రచారం చేస్తే ఏడాది జైలు

కరోనాకు సంబంధించి సామాజిక మాధ్యమాల్లో కానీ, ప్రకటనల రూపంలో తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తే ఏడాది జైలు శిక్ష తప్పదని హైదరాబాద్ పోలీసు కమిషనర్ అంజనీకుమార్ హెచ్చరించారు. తప్పుడు ప్రచారం వల్ల సమాజంలో ఒక రకమైన భయాందోళన వ్యక్తం అవుతుందని, ఇది ఏమాత్రం మంచిది కాదని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ క్రమంలో కరోనాకు సంబంధించిన తప్పుడు సమాచారాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేస్తే వారిపై జాతీయ విపత్తు నిర్వహణ మండలి చట్టం 5.1, ఎన్‌డీఎమ్‌ఏ యాక్ట్ సెక్షన్ 54 కింద కేసు నమోదు చేస్తామని చెప్పారు. ఈ సెక్షన్ కింద ఏడాది జైలు, భారీ జరిమానా ఉంటుందని స్పష్టం చేశారు. నగరంలో కరోనా కట్టడికి సర్కారు పకడ్బందీ ఏర్పాట్లు చేసిందని ఆయన వెల్లడించారు.
ఇక మరోవైపు మెట్రోలో ప్రయాణికుల సంఖ్య కరోనా భయంతో రోజురోజుకు తగ్గిపోతుంది. మెట్రోలో ప్రయాణికుల సంఖ్య ప్రతి రోజూ 4.50లక్షల వరకు ఉంటుంది. అయితే మైండ్‌స్పేస్‌లో కరోనా కలకలం నేపథ్యంలో మెట్రో రైలులో ప్రయాణికుల సంఖ్య తగ్గిపోయింది. పది వేల మందికి పైగా ప్రయాణికులు తగ్గారని మెట్రో వర్గాలు చెబుతున్నాయి.