సంక్రాంతి కష్టాలు : బస్సుల్లేక ప్రయాణీకుల అవస్థలు
హైదరాబాద్ : సంక్రాంతికి నగరవాసులు పల్లెబాట పట్టారు. ఉపాధి నిమిత్తం నగరంలో ఉంటున్న ఏపీ, తెలంగాణ ప్రజలంతా సొంతూళ్లకు పయనమయ్యారు. ఏ సెంటర్ చూసినా సంక్రాంతికి ఊరెళ్తున్న ప్రయాణీకులతో సందడిగా మారింది. దీంతో ఎటు చూసినా బస్సులన్నీ రద్దీగా ఉన్నాయి. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు ప్రయాణీకులతో కిటికిటలాడుతున్నాయి. అయితే ప్రయాణీకుల రద్దీకి తగ్గట్టుగా బస్సులు లేవు. దీంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పిల్లాపాపలతో నడిరోడ్డుపై అవస్థలు పడుతున్నారు.
ఎల్బీనగర్‌లో ఇదే పరిస్థితి. సొంతూళ్లకు వెళ్లేందుకు బస్సులు లేక, సమయానికి రాక ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నగరం నుంచి ఏపీ వైపు వెళ్లేందుకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశామని అధికారులు చెబుతున్నా..సరైన సమయానికి రావడం లేదని ప్రయాణీకులు ఆవేదన చెందుతున్నారు.
సంక్రాంతి పండుగ రద్దీ దృష్ట్యా టీఎస్ ఆర్టీసీ, ఏపీఎస్ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతోంది. సికింద్రాబాద్ ద.మ.రైల్వే శాఖ అదనపు బోగీలతో 206 రైళ్లను ఏర్పాటు చేసింది. హైదరాబాద్ నుంచి సొంతూళ్లకు వెళ్లే వారి సంఖ్య 35 లక్షలు ఉంటుందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఏపీ, తెలంగాణ గ్రామాలను నుంచి హైదరాబాద్‌లో ఉంటూ ఉద్యోగం చేసుకుంటున్న వారు కుటుంబసమేతంగా సొంతూళ్లకు వెళ్తున్నారు.