తెలంగాణ వచ్చాక కూడా ఇలాంటి ఘటనలు బాధాకరం : ఆర్టీసీ కార్మికుడి ఆత్మహత్యపై పవన్ ఆవేదన

ఆర్టీసీ కార్మికుడు శ్రీనివాస్ రెడ్డి ఆత్మహత్యపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. శ్రీనివాస్‌రెడ్డి ఆత్మహత్య తీవ్రంగా కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డి ఆత్మహత్య అత్యంత దురదృష్టకరమన్నారు. ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకుని ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా ఇలాంటి ఘటనలు జరగడం బాధాకరమన్నారు. ఇప్పటికైనా ఆర్టీసీ కార్మికులను తెలంగాణ ప్రభుత్వం చర్చలకు పిలవాలని పవన్ సూచించారు.
ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో నెలకొన్న పరిణామాలతో ఖమ్మం జిల్లాకి చెందిన ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డి తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. అక్టోబర్ 12వ తేదీ శనివారం ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. అక్కడే ఉన్న వారు మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. అప్పటికే 90 శాతానికి పైగా శరీరం కాలిపోయింది. వెంటనే ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని డీఆర్‌డీవో ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.
డీఆర్డీవో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీనివాస్ 2019, అక్టోబర్ 13న మృతి చెందారు. ఇది మరువక ముందే మరో ఆర్టీసీ కార్మికుడు(కండక్టర్) కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రభుత్వ వైఖరి వల్లే కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి.
ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డి ఆత్మ బలిదానం తీవ్రంగా కలచివేస్తుంది. కోరుకున్న తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఇలాంటి సంఘటన చోటు చేసుకోవడం శోచనీయం – జనసేన అధినేత #PawanKalyan#TSRTCStrike #JanaSena #JSPWithTSRTCemployees pic.twitter.com/Mym3GCnZBU
— JanaSena Party (@JanaSenaParty) October 13, 2019